అప్పు చెల్లించాలన్నందుకు హత్య

 – శరీర భాగాలను నరికి ఫ్రిజ్‌లో దాచిన నిందితుడు
 – దుర్వాసన రాకుండా స్ప్రేలు, కెమికల్స్‌ వినియోగం
–  ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో నష్టపోయిన నిందితుడు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ సంతోష్‌నగర్‌
అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్న మహిళను హత్య చేసి.. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికాడు దుండగుడు.. తల నరికి, శరీరభాగాలను ముక్కలు చేసి ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. మొండెం లేని తల లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల కింద హైదరాబాద్‌ మలక్‌పేట మూసీ పరివాహక ప్రాంతమైన తీగలగూడ వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో మహిళ తల లభించిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సౌత్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రూపేశ్‌ వివరాలు వెల్లడించారు.
మొండెం లేని మహిళ తల లభించిన తర్వాత మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది పోలీసు బృందాలను రంగంలోకి దించారు. మహిళ తలతో పోస్టర్లను ముద్రించిన పోలీసులు.. మలక్‌పేట, సైదాబాద్‌, చాదర్‌ఘాట్‌, పాతబస్తీతోపాటు పలుచోట్ల చూపిస్తూ ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 750 పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలించారు. తల లభ్యమైన పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు చైతన్యపురికి చెందిన చంద్రమోహన్‌పై అనుమానం వచ్చింది. అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రాథమిక నిర్ధారణకు వచ్చాక అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఎర్రం అనురాధ(55) ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. పదేండ్ల కిందట చంద్రమోహన్‌ తండ్రికి ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. చంద్రమోహన్‌ ఇంట్లోనే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అనురాధకు గదిని అద్దెకు ఇచ్చాడు. రెండేండ్లుగా ఆమె అక్కడే నివాసముంటోంది. ఆమెతో సన్నిహితంగా ఉండి దాదాపు రూ.7లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
ఇదిలావుండగా, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో దాదాపు రూ.18లక్షల వరకు నష్టపోయిన చంద్రమోహన్‌ అప్పుల పాలయ్యాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని అనురాధ నిలదీయడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న అతను ఈనెల 12న మధ్యాహ్నం ఆమెతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత కత్తి, రెండు స్టోన్‌ కట్టర్స్‌తో శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. శరీర భాగాల్లోని కొన్నింటిని బకెట్‌లో, కాళ్లను ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఇంట్లో వాసనరాకుండా మృతురాలి శరీర భాగాలపై కెమికల్స్‌, ఫినైల్‌, డెట్టాల్‌, ఆగర్‌బత్తీలు, కర్పూరం, స్ప్రేలు చల్లాడు. శరీర భాగాలను మాయం చేసేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చూశాడు. 15న తలను బ్లాక్‌ కలర్‌ పాలిథిన్‌ కవర్‌లో పెట్టి ఆటోలో తీసుకొచ్చి మలక్‌పేట మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతురాలి సెల్‌ఫోన్‌తో తెలిసిన వారికి మెసేజ్‌లు చేసేవాడు. అయితే, తీగలగూడ వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో మొండెం లేని మహిళ తల గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. మృతురాలి శరీర భాగాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ జీ.శ్యాంసుందర్‌, మలక్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌, డీఐ ఎల్‌.బాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love