తెలంగాణను ఆయిల్‌ పామ్‌ సాగు హబ్‌గా మార్చడమే నా జీవిత లక్ష్యం

My life mission is to make Telangana a hub of oil palm cultivation– రైతులకు లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్‌పామ్‌
– విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణను ఆయిల్‌పామ్‌ సాగు హబ్‌గా మార్చడమే తన జీవిత లక్ష్యం అని, తద్వారా పామాయిల్‌ సాగుతో రైతులు పేదరికం నుంచి రాజులుగా మారాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో నూతనంగా నిర్మించబోతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు పొలం బాట పట్టేలా ఆయిల్‌ పామ్‌ సాగును చేయించే విధంగా చూడాలన్నారు. ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ పెంచడం వల్ల దేశీయంగా ఆయిల్‌ పామ్‌ రైతాంగంకు లాభాలు వస్తున్నాయని, ఏడాదికి లక్ష ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగు చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు. తన చిరకాల కోరిక సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడమన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్ట్‌తో సాగు నీళ్ళు అందిస్తామని చెప్పారు. రఘునాధపాలెం మండలంలో రూ.66 కోట్లతో మంచుకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంక్రాంతి నాటికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఇప్పటికే జాతీయ రహదారులు ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట పట్టిందన్నారు. ఉద్యాన పంటల సాగుతో రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఏడో తేదీన శంకుస్థాపన చేస్తారని తెలిపారు. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన స్వామి నారాయణ ట్రస్ట్‌, ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాల ఏర్పాటుకు క్యాబినెట్‌ అనుమతి తెలిపిందని అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా క్యాబినెట్‌లో ఉండే అవకాశం ఖమ్మం ప్రజానీకం ఆశీర్వాదంతో తనకు దక్కిందన్నారు. అరాచకం, అక్రమాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజా పాలనలో ప్రజలు కోరినట్టు ఖమ్మం ప్రగతి బాటలు వేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌, జడ్పీ సీఈవో దీక్ష రైనా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు దుర్గాప్రసాద్‌, మానుకొండ రాధా కిషోర్‌, సాధు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love