నా మొగడు సిపాయి నెలకు రూపాయి

My salary per month is Rsకొన్ని వృత్తులు గమ్మత్తిగా వుంటయి. చెప్పుతే పెద్దదే పేరు. సమాజంలో గౌరవమే వుండవచ్చు. ఎవలు పడితే వాల్లే పలకరించవచ్చు. కాని జీతం మాత్రం తక్కువ వుంటది. దీన్నే ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అని అంటరు. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే విలేకరి వృత్తే అనుకో, అంటే ఇది వృత్తి కాదు ప్రవృత్తి అంటరు. కానీ ఎల్లవేల్లలా అప్రమత్తంగానే వుంటది. ఇంకా కొందరు ఏం పని చేయరు. తింటరు, తిరుగుతరు. అంతే వాల్లకు సుత అన్ని ఎల్లుతయి, అన్నీ నడుస్తయి. నీ పెనిమిది ఏం పని చేస్తడని ఆయన భార్యను ఎవరైనా అడిగితే, తాను ‘నా మొగడు సిపాయి నెలకు రూపాయి’ అనే ఒక్క జానపద సామెత వాడుతది. అప్పుడే అంతా అర్ధం అయిపోతది. ఇట్లనే మరికొందరు కన్పిస్తరు. ఇరవై నాలుగు గంటలు బిజీగా వుంటరు. మీ పని వాని పని అంటూ తిరుగుతరు. లేకుంటే రాజకీయ పార్టీ నాయకుల ఎనుక తిరిగేవాల్లు వుంటరు. అక్కడ ఇక్కడ పంచాయితీకి అయితే అక్కడా నిలబడుతరు. అసొంటోల్లను ఏం చేస్తున్నవ్‌ అంటే ‘గవ్వారాకడ లేదు, గడియ పరుసతులేదు’ అంటరు. ఇక్కడ గవ్వ అంటే డబ్బులు అని అర్ధం. కొన్ని చోట్ల దమ్మిడీ అని కూడా అంటరు. గడియ అంటే కాలమానం, పురుసతు అంటే విరామము అని అర్ధం. అంటే ఒక్క పైస కూడా రాకడ లేదు, గడియ సేపు కూడా విశ్రాంతి లేదు అనే అర్ధంలో ఉపయోగించే సామెత.
నియమిత పనిలేని వారికి అందరు ఏదో పని చెప్పుతనే వుంటరు. ఏదో ఒకటి చేస్తరు కానీ ఇదమిద్దంగా ఇంత కూలీ అని గాని, వేతనం అని గానీ ఇవ్వబుద్ది గాదు. మరికొందరు ఆయింత ఏం పని చేయక సోమతిపోతుల లెక్క వుంటరు. వాల్లు ఇంట్ల ఏం పట్టించుకోరు. వాల్లను ‘గడ్డిగాలికి పోతేంది వడ్లు వాగుల పోతేంది’ అంటరు. వాకిట్ల వడ్లు ఎండ పోస్తే వర్షం వచ్చినా కాని ‘మన్ను తిన్న పాము లెక్కనే’ వుంటరు గాని కదలరు మెదలరు. మరికొందరు ఇంట్లనే వుంటరు. ఏం గమనించరు. ఏదైనా చిన్న వస్తువు పోతే చూస్తే వద్దంటరు. వాల్లను చూస్తే ‘ఎనుకకెల్లి ఏనుగులు పోయినా ఏం లేదు కాని ముందటకెల్లి చీమలు కూడా పోవద్దు’ అంటరు. మనుషుల వ్యక్తిత్వాలను కరెక్టగా పట్టేట్టుగ జానపదులు, సామెతలు సృష్టించుకున్నరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love