– నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌ను కూల్చిన హైడ్రా
– దశాబ్ద కాలం నుంచి అనేక ఫిర్యాదులు
– లోకాయుక్తలో కేసులు వేసిన ప్రజాసంఘాలు, పలువురు నాయకులు
– ఎట్టకేలకు హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేత
– ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ-మియాపూర్
హిరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. ఉదయం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ కానమెట్ విలేజ్‌లోని ఎన్ కన్వెన్షన్‌కు వద్దకు చేరుకున్న అధికారులు జేసీబీల సాయంతో దాన్ని నేలమట్టం చేశారు. ఈ అంశంపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అప్పటికే కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా నేలమట్టం అయింది. కన్వెన్షన్‌కు అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. కూల్చివేతకు ముందు కనీసం నోటీసు ఇవ్వలేదని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మాదాపూర్ కానమెట్ విలేజ్ పరిధిలోని సర్వే నెంబర్ 36లో 29 ఎకరాల 44 గుంటల భూమిలో తుమ్మిడికుంట చెరువు ఉండేది. అయితే, చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. ప్రస్తుతం ఎనిమిది ఎకరాల విస్తీరంలో మాత్రమే చెరువు ఉంది. కబ్జాకు గురైన చెరువు స్థలంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూడా ఉంది. ఇది దాదాపు మూడు ఎకరాల్లో ఉంది. అయితే, ఈ చెరువు ఆక్రమణకు గురవుతుందని 2012 లోకాయుక్తలో కేసు సైతం నమోదైంది. కేసు నంబర్ 2815/2012 ఈ కేసు కొనసాగుతోంది. అధికారులు 24/08/2013లో సర్వే నిర్వహించి చెరువు గుర్తింపు నెంబర్ 3717 ఇచ్చారు. అయితే, గత ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయాలని భావించి తరువాత వెనక్కి తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వం చెరువులు, కుంటల రక్షణకు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మూడ్రోజుల కిందట అందిన ఫిర్యాదు మేరకు సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు అందినట్టు హైడ్రా తెలిపింది. పక్కా ఆధారాలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత కార్యక్రమం జరిగింది. అయితే, కూల్చివేతలతో ఆపకుండా చెరువులను కాపాడాలని, ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, గండిపేట్ గ్రామంలో సర్వే నంబర్ 60, 61లో నిర్మించిన అక్రమ విల్లాలను నార్సింగి అధికారులు కూల్చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ భవనాలను పోలీసు భద్రత నడుమ నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.