– మంత్రి ఎర్రబెల్లి కి బువ్వ తినిపించిన దళిత విద్యార్థులు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
ఆయనో మంత్రి, అంతకుముందే ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ, 40 ఏళ్ల జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నేత అలాంటి వ్యక్తి విద్యార్థులతో సామాన్యుడిలా వారి చేతి ముద్దలు తిన్నారు. తన స్థాయిని తగ్గించుకుని గోముగా గోరు ముద్దలు తిన్నారు. ఆయనెవరో కాదు ఆయనే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్ర మంత్రిగా వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ….పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. గుర్తూరు లో తన కార్యక్రమాన్ని ముగించుకొని హరిపిరాల లో మరో కార్యక్రమానికి వెళ్తుండగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు మంత్రిని చూద్దాం అని గోడలు పైకి ఎక్కి చూస్తున్నారు. ఆది గమనించిన మంత్రి ఎర్రబెల్లి తన వాహనాన్ని దిగి అక్కడ వున్న విద్యార్థులతో ముచ్చటించారు. మంచిగా చదువుతున్నారా…?, ఇప్పుడు స్కూల్ లో ఏం చేస్తున్నారు?, మధ్యాహ్న భోజనం అందుతుందా….? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. వాటికి విద్యార్థులు సమాధానం చెప్తూ… ప్రస్తుతం భోజనం తింటున్నాం అని చెప్పారు. అదే స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న మంగళంపల్లి తేజ్ కుమార్ తింటుండగా… మంత్రి ఎర్రబెల్లి బువ్వ మంచిగున్నదా?! అని అడిగాడు. బాగుంది అన్నాడు. మరి నాకు పెడ తావా?! అని అడిగాడు. ఇదిగో అంటూ ఆ తేజ్ పెట్టాడు.అతి సామాన్యుడిలా…. చిన్న పిల్లాడి గా ఆ బాబు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి తన చేతితో ముద్దలు తినిపించారు. చాలా బాగుంది బిడ్డ… అంటూ ఆ బాబును ఆశీర్వదించి తన పర్యటనకు బయలుదేరారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంతా… పెద్దాయాన మంత్రి గా ఉండి వారితో చిన్న పిల్లాడిలా, సామాన్యుడిగా ముచ్చట పెట్టడం మస్త్ ఆనందంగా వుందని తబ్బిబ్బుయాపోయారు.