రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ విజేతగా నల్లగొండ జిల్లా జట్టు

– ద్వితీయ స్థానంలో సూర్యాపేట జిల్లా
– బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్ : కుందూరు జానారెడ్డి ఛాలెంజర్ ట్రోఫీ 70వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో గత మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు సోమవారంతో ముగిశాయి.మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో నల్లగొండ,సూర్యాపేట జిల్లాల జట్లు ఫైనకు చేరుకొని తలపడగా నల్గొండ జిల్లా జట్టు విజయకేతనం ఎగురవేయగ సూర్యాపేట జిల్లా రన్నరఫ్ గా నిలిచింది. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీల్లో క్రీడాకారులు తమ ఆట తీరుతో, నైపుణ్యంతో క్రీడాప్రేమికులను అలరించారు. ఫైనల్స్‌ పోటీలను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. క్రీడాకారులు స్ఫూర్తి, క్రమశిక్షణతో పోటీ పడాలన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి,తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,నల్గొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. భూలోకరావు, జి. కర్తయ్య తో కలిసి విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కబడ్డీ క్రీడాకారులు తదితరులున్నారు.

Spread the love