– పాత పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఫొటో సెషన్
– ఉపరాష్ట్రపతి, ప్రధానితో కలసి బీఆర్‌ఎస్ ఎంపీల ఫొటోలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
నూతన పార్లమెంటు భవనంలోకి బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు మంగళవారం అడుగిడారు. 75 ఏళ్లలో అనేక కీలక ఘట్టాలకు కేంద్ర బిందువుగా నిలిచిన పాత పార్లమెంట్ భవనం ప్రాంగణంలో ఎంపీలతో ఫొటో సెషన్‌కు హాజరయ్యారు. పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ లోక్ సభ, రాజ్యసభ సభ్యులంతా కలసి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత విడివిడిగా ఫొటోలు దిగి, పాత భవనానికి వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ , ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ముందు వరుసలో కూర్చోగా వారితో పాటు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కె. కేశవరావు, లోక్ సభ నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, తదితర పార్టీ ఎంపీలు కూర్చున్నారు. ఎంపీలతో సమావేశం అనంతరం ప్రధాని నరేంద్రమోదీ ఎంపీలతో కలసి కొత్త పార్లమెంట్ భవనానికి కాలినడకన చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎంపీలంతా పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతత్వంలో కొత్త పార్లమెంట్ లో ఆశీనులయ్యారు. లోక్ సభ లో ముందు వరుసలో ఎంపీ నామ కూర్చున్నారు. అంతకుముందు రోజు సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నామ డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరుపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ దళిత పక్షపాతని పేర్కొన్నారు.