2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ల అమలుకు నామ డిమాండ్‌

– జనగణన, డీలిమిటేషన్‌ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ?
– 2014 జూన్‌ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా
– బిల్లుకు కేసీఆర్‌ ఆమోదం.. కేంద్రానికి పంపి 10 ఏళ్ళు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
సుదీర్ఘ కాలం తర్వాత చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ లోక్‌ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌ సభలో మహిళా బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఎంపీ నామ మాట్లాడారు. బిల్లును బీఆర్‌ ఎస్‌ పార్టీ సమర్దిస్తుందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, 2024 ఎన్నికల్లో మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నామ కేంద్రాన్ని కోరారు. 1996లో దేవెగౌడ, 12వ లోక్‌ సభలో వాజ్‌ పారు ప్రభుత్వం, 13, 15 లోక్‌ సభల్లో కూడా మహిళా బిల్లు ప్రస్తావనకు వచ్చిందని , కానీ ఆమోదించలేదని అన్నారు. 15వ లోక్‌ సభ కాలంలో రాజ్యసభలో ఈ బిల్లు పాసయిందని, కానీ లోక్‌ సభలో పెండింగ్‌ లో ఉన్నా ఇప్పటికైనా ఆమోదించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 2014 జూన్‌ లో మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ కు సంబంధించి తీర్మానం చేసి , కేంద్రానికి పంపించి ఇప్పటికి 10 ఏళ్లయిందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జట్పీటీసీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. అలాగే మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలతో పాటు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు దక్కుతుందని నామ చెప్పారు. త్వరితగతిన మిగతా ప్రక్రియను పూర్తి చేసి, రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.

Spread the love