సీఎం రేవంత్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ ప్రశంసలు

నవతెలంగాణ – హైదరాబాద్: బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని… ఆ కారణంగానే మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని పేర్కొన్నారు. నాడు బండలతో నిండిన ఈ ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. ఇక్కడ రోగులకు మంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.6 కోట్లు మంజూరు చేసి… ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడ్డారన్నారు. ఇంత గొప్ప ఆసుపత్రికి తాను చైర్మన్‌గా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Spread the love