గుండె లోతుల్ని తడిపే(మే) నానీలు

ఆధునిక సాహిత్యంలో విస్తతంగా వ్యాపించిన కొత్త ప్రక్రియ నానీలంటే అతిశయోక్తి కాదు. గోపి గారి నుండి స్ఫూర్తి పొంది నానీలతో కవిత్వానికి శ్రీకారం చుట్టిన కవి వెన్నెల సత్యం. వేయికి పైగా నానీలు రాసి నాలుగో సంపుటిగా ‘నాన్న నానీలు’తో మన ముందుకు వచ్చాడు. అటు అమ్మకూ ఇటు నాన్నకూ నానీలతో నీరాజనం పలికి తన తల్లిదండ్రుల ఋణం తీర్చుకొనే ప్రయత్నం చేసిన వెన్నెల సత్యం భిన్న పార్వ్శాలనుండి నాన్నను మనకు దర్శింపజేస్తాడు.
కంటికి కనబడని వేరులాగా కుటుంబానికి ఆధారం నాన్న. అందంగా వికసించే పువ్వులాంటి పిల్లలకు తాను కొమ్మగా మారి వింజామర విసురుతాడు. ఇంట్లో అబ్బాయి పుట్టగానే కొండంత అండగా ఉంటాడని చిన్నప్పటి నుండే ఇంట్లో ప్రతి అవసరానికే గాక, సమాజంలోని మార్పులకు, స్థితిగతులకు, పరోక్షంగా, ప్రత్యక్షంగా పురుషుడు ఓ భాగమవుతాడు. కుటుంబంలోని వారికి నీడలా రక్షణ ఇస్తాడు.
ఇక నానీల్లోకి ప్రవేశిస్తే ఓ మెరుపు, ఓ చరుపు పాఠకుల హదయాలను కొల్లగొట్టే నానీలు అనేకం కనిపిస్తాయి. అస్తికుడు, నాస్తికుడు అనే పదాన్ని ఎంత ధ్వన్యాత్మకంగా వాడాడో ఈ నానీలో చూడండి. ”ఆస్తులు పిల్లలకిచ్చి/ ఆస్తికుల్ని చేశాడు/ నాన్న చివరికి/ నాస్తికుడు” అస్తుల విషయం అర్థమైన పాఠకులు ఆహా అనేస్తారు.
నాన్న అలుపెరుగని అల. తన కుటుంబం కోసం నిత్యం పోటెత్తుతూనే ఉంటాడు. జీవన మార్గంలో తన బిడ్డలు సఫలీకతం కావాలని ప్రయత్నాలు చేస్తాడు. తను మాత్రం సంసార సముద్రంలో కొట్టుమిట్టాడుతూ బిడ్డను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తాడు. ”నాన్న అంటే/ అలుపెరుగని అల /బిడ్డల్ని ఒడ్డుకు చేర్చి/ తాను సముద్రంలోనే”/ అనడంలో కవి హదయం స్పష్టమవుతుంది.
ఎక్కడా ఓటమిని ఎరుగని నాన్న తన బిడ్డల సంతోషం కోసం బిడ్డల చేతిలో ఓడిపోవడానికి కూడా ఇష్టపడతాడు. ”ఓడిపోతూనే/ ఉంటాడు నాన్న/ నిరంతరం/ బిడ్డల్ని గెలిపిస్తూ” ఎంత సత్యమో కదా. తనకు తన కుటుంబానికి, ఎన్నో విషయాల్లో, ఏవో సమస్యలున్నా, తన గొంతులోనే దాచుకుంటూ, పైకి మాత్రం పిల్లలకు, ఇంట్లో వాళ్లకి తెలియకుండా తనలో తనే మదన పడుతుంటాడు ”విషయాలన్నీ/ గొంతులో దాచాడు/ గరళ కంఠుడా/ కాదు మా నాన్న/” నిజంగా ప్రతీ నాన్నా ఓ గరళకంఠుడే. కాదనగలమా.
కుటుంబానికి ఆర్థిక అవసరాలు తీర్చేది నాన్న. వర్తమానంలో ఏటిఎంగా మారిపోయిన నాన్న ఔన్నత్యాన్ని నిలబెట్డిన నానీ ఇది. ”నాన్నంటే/ నడిచే ఏటీఎం కాదు/ ప్రేమానురాగాల/ రిజర్వు బ్యాంకు”. ఏం సంపాదించావనే ప్రశ్నల ముల్లు నాన్నను అనుక్షణం పొడుస్తూనే ఉంటుంది. సంపాదించిందంతా ఇచ్చినా/ లాక్కున్నా ఈ ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది. ఈ దశ్యాన్ని హద్యంగా మలచిన ఈ నానీ చూడండి. ”ఆస్తుల్నే కాదు/ హదయమూ రాసిచ్చాడు/ నాన్న ఇప్పుడు/ గుండె లేని మనిషి”
నాన్న గాంభీర్యానికి ప్రతీక. పగలంతా మనకు కావలసిన, వెలుతురునిచ్చే సూర్యుడిలా, రాత్రివేళ చల్లని చంద్రుడిలా అని నాన్న ద్వైదీరూపాన్ని కళ్ళకు కడతాడు. ”పగలంతా పనిలో/ మండే సూర్యుడు/ రాత్రయితే ఇంట్లో/ చల్లని చంద్రుడు”
నాన్న ఎన్నో కలలతో ఓ అద్దాల మేడ కడతాడు. అదెలా పేకమేడలో కూలుతుందో చూడండి. ”అద్దాల మేడ కట్టిన/ నాన్న బతుకు/ పిల్లల చేతుల్లో/ పేక మేడ” నిష్టూరమైన నిజాల్ని బట్టబయలు చేస్తాడు కవి.
”నాన్న చేతిలో/ బాల్యం/ అందాల హరివిల్లు/ చివరికి/ తానొక వంగిన విల్లు” వంగిన విల్లులా మారిపొయిన నాన్నల పరిస్థితి ఈ నానీలో మనకు కనిపిస్తుంది.
ఈ నానీలు చదువుతుంటే గుర్తింపు లేని నాన్నల జీవితాలు అడుగడుగునా కనిపిస్తాయి. అమ్మ గురించి రాయని కవి లోకంలోనే ఉండడు. కానీ నాన్న గురించి రాసిన కవులు తక్కువే. ఇద్దరి గురించీ రాసిన వెన్నెల సత్యం ధన్యజీవి. చదివిన ప్రతి పాఠకుడి హదయాన్ని తడిపే(మే) నానీలు ఇవి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
– కె.ఉషారాణి, ఆరుట్ల

Spread the love