ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్

నవతెలంగాణ – అమరావతి: ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా అరెస్ట్ అవుతారంటూ వైసీపీ శ్రేణులు కొన్ని రోజులుగా ఫీలర్స్ వదులుతున్న సంగతి తెలిసిందే. వారు చెపుతున్నట్టుగానే లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను ఏ14గా సీఐడీ పేర్కొంది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేశ్ పేరును చేర్చింది. కేసు వివరాల్లోకి వెళ్తే… అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ఏడాది ఐపీసీ, అవినీతి నిరోధకచట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

Spread the love