నవతెవలంగాణ -అమరావతి : జైలులోనే చంద్రబాబుని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అక్రమ అరెస్ట్ చేయించిందనే అనుమానాలు బలపడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి, బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదని, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించారని పేర్కొన్నారు. చంద్రబాబుకి ఇలాగే చేయాలని సిఎం జగన్ కుతంత్రాలు అమలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని లోకేష్ హెచ్చరించారు.