కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా నారాయణ


నవతెలంగాణ – హైదరాబాద్

రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా పులిమామిడి నారాయణను సీఎం కేసీఆర్‌ నియమించారు. ప్రస్తుతం ఆయన బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో సీపీఐ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. గత 13 సంవత్సరాలుగా పార్టీ కొనసాగుతూ.. బీఆర్‌ఎస్‌ అనుబంధ బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నారాయణ స్వస్థలం రంగారెడ్డి జిల్లా చేవేవెళ్ల మండలం నాంచారి గ్రామం. ఆయనది మధ్య తరగతి రైతు కుటుంబం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. ఉద్యమ సమయంలో అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో అరెస్టయి జైలుకు వెళ్లారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కార్మికులతో పాటు ప్రజల్లోకి గులాబీ కార్యకర్తగా తీసుకెళ్తున్నారు. 13 సంవత్సరాలుగా పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తనను పదవికి ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనేదానికి తన నియామకమే నిదర్శనమని నారాయణ పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

Spread the love