సుందరయ్య చెప్పిన పోరాటమ్మల చర్రిత

అన్యాయం చెలరేగినప్పుడు, అరాచకం రాజ్యమేలినప్పుడు మహిళలు ప్రశ్నలై నిలబడ్డారు. దారుణాలు రంకెలేసినప్పుడు, దౌర్జన్యాలు పెచ్చరిల్లినప్పుడు అగ్గిబరాటాలై తిరగబడ్డారు. నిర్బంధాలు కమ్ముకొచ్చినప్పుడు, నియంతృత్వానికి కొమ్ములొచ్చినప్పుడు మహా యోధలై గర్జించారు. చిత్రహింసలకు గురి చేసినా నోరు విప్పలేదు. ఉద్యమ రహస్యాలను బయటపెట్టలేదు. అమానుష అత్యాచారాలకు బలి చేసినా బెదిరిపోలేదు. పోరాట దారిని వదిలిపెట్టలేదు. మహిళలు .. సహజసిద్ధమైన పోరాట యోధలు. ఇటు కుటుంబాన్ని, అటు విముక్త పోరాటాలను కంటిరెప్పలా కాపాడే మహాతల్లులు.

book

ఈనెల 14వ తేదీ .. మే రెండో ఆదివారం ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం. మే 19న కమ్యూనిస్టు మహానేత పుచ్చలపల్లి సుందయ్య 38వ వర్థంతి. 1946 – 1951 మధ్య భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన తెలంగాణా సాయుధ పోరాటంలో సుందరయ్య ప్రత్యక్ష పాత్ర పోషించారు. ఆ పోరాటంలో ఆనాటి మహిళలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను, త్యాగ నిరతిని ఆయన అత్యంత గౌరవంతో, ప్రేమాభిమానాలతో తాను రాసిన ‘వీర తెలంగాణా విప్లవ పోరాటం – గుణపాఠాలు’ పుస్తకంలో రికార్డు చేశారు. ఆ సమాచారం ఆధారంగా ఈ ప్రత్యేక కథనం అందిస్తున్నాం. 70 ఏళ్ల క్రితం సాధారణ మహిళా మూర్తులు ప్రదర్శించిన అసాధారణ పోరాట స్ఫూర్తి ఈనాటికీ ఆదర్శప్రాయమని సుందరయ్య రాసిన సమరశీల చరిత్ర నుంచి ఉటంకిస్తున్నాం.
బిడ్డకు జన్మనివ్వడం చేత, ఆ బిడ్డను అన్ని వేళలా కంటికి రెప్పయి కాపాడ్డం చేత … అమ్మలు ప్రకృతిసిద్ధంగానే గొప్ప సంరక్షకులు. అలాంటి అమ్మలు ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు; ఉద్యమాలను కాపాడ్డంలోనూ, నిర్మించటంలోనూ, ఆ క్రమంలో త్యాగాలు చేయటంలోనూ ఎంతో ముందుంటారు. ఓ మూడుతరాల ముందు.. తెలంగాణాలో జరిగిన రైతాంగ సాయుధ పోరాట వెల్లువే ఇందుకు సజీవ సాక్ష్యం. ఈ పోరాటంలో స్త్రీలు చాలా ప్రముఖ పాత్ర వహించారు. నైజాం – రజాకార వ్యతిరేక పోరాటంలోనూ, తర్వాత నెహ్రూ సైన్యాలకు, కాంగ్రెస్‌ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడటంలోనూ వారి ధైర్యసాహసాలు అనన్య సామాన్యం.. అద్వితీయం. వారూ పోరాట దళాల్లో చేరారు. కొండల్లో, గుట్టల్లో, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కష్టసుఖాలు పంచుకున్నారు. కొరియర్లగానూ, రాజకీయ ఆందోళన కారులుగానూ బాధ్యతలు స్వీకరించారు. రజాకార్‌ – నైజాం పోలీసులు, ఆ తర్వాత నెహ్రూ సైన్యాలు జరిపిన అమానుష, చిత్రహింసలకు ఎక్కువగా గురైంది, బలైందీ స్త్రీలే! కిరాతక మూకల దౌర్జన్యానికి తమ ధన మాన ప్రాణాలు బలి కాకుండా రక్షించుకునేందుకు స్త్రీలు చూపిన దీక్ష, ప్రతిఘటన, పోరాట పటిమ మనలను ఎంతో ఉత్తేజపరుస్తాయి.
భూమి కోసం …
విసునూరు దేశ్‌ముఖ్‌ దురాక్రమణకు గురికాకుండా తన భూమిని నిలబెట్టుకోవటానికి ఆంధ్ర మహాసభ – కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొట్టమొదట తీవ్రంగా పోరాడింది చాకలి ఐలమ్మ. తన కొడుకులను, కూతుళ్ళను కూడా పోరాట బాటలో నడిపింది. తెలంగాణా రైతు భూమి కోసం జరిపిన పోరాటపు చిహ్నం ఐలమ్మ. ఇంకా అలాంటి మహిళా యోధలు ఎందరో ..!
మిర్యాలగూడెం తాలూకా ముకుందాపురంలో ఒక షాపుకారు కుమ్మరి మట్టయ్యను భూమి స్వాధీనం చేయమని బలవంతపెట్టాడు. మట్టయ్య అంగీకరించలేదు. నెహ్రూ సైన్యాల సహకారంతో, మట్టయ్యను చిత్రహింసలు పెట్టి చంపేయించాడు. మట్టయ్య భార్య రంగంలోకి దూకింది. ఈ భూమిని ససేమిరా వదిలేది లేదంది. ఆమెను పోలీసులు పశుత్వంతో అత్యాచారానికి తెగబడ్డారు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. ఆ గ్రామ ప్రజలందరినీ కదిలించి, తమ భూమిని కాపాడుకొంది. వాడపల్లిలో భూమిని తనకు అప్పగించనందుకు భూస్వామి ఒక లంబాడీ రైతును హత్య చేయించాడు. అతని భార్య పోరాటంలోకి దిగి, భూస్వామిని, పోలీసులను ఎదిరించి ఆ భూమిని నిలుపుకుంది.
కొండిపోలులో కూడా రెండెకరాలను సాగు చేస్తున్న లంబాడీ రైతును ఆ భూమి తిరిగి తనకే దక్కాలని దత్తుడు అనే భూస్వామి చంపేయించాడు. కానీ, రైతు భార్య ముందుకు వచ్చి ఆ భూమిని నిలుపుకొంది.
సిలారుమియా గూడెంలో భూమిని భూస్వామికి స్వాధీనం చేయనందుకు గొల్ల ముత్తయ్యను చంపేశారు. ఆయన భార్య మాత్రం, ఆ భూమిని తిరిగి భూస్వాముల వశం కాకుండా పోరాడి సాధించింది.
మొద్దులకుంటలో ఒక లంబాడీ రైతు సాగు చేస్తున్న భూమిని… నెహ్రూ సైన్యాల ప్రవేశం అనంతరం స్వాధీనం చేసుకొనటానికి భూస్వామి ప్రయత్నించాడు. రైతును చితకబాది, పొలం నుంచి వెళ్ళగొట్టారు. అతడి భార్య మాత్రం తలొగ్గలేదు. ఆ భూమిని దున్నుకుని, పంటను ఇంటికి చేర్చుకోగలిగింది.
వీరారంలో తన భూమిని భూస్వామి తిరిగి ఆక్రమిస్తుంటే- ఒక లంబాడీ రైతు, అతని భార్య కలిసి ఎదిరించారు. పోలీసులు అత్యంత కిరాతకంగా.. గర్భవతైన ఆమె కడుపుపై కాలేసి తొక్కి, చంపారు.
తెలంగాణా పోరాటంలో ఇలాంటి సంఘటనలు వందలాదిగా జరిగాయి. వేలాది స్త్రీలు భూమి కోసం, దక్కిన భూమిని నిలుపుకోవటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు.

poratalu women

పోరాటంలో సమభాగం..
నిజాం రజాకారులు గ్రామాలపై దాడి ిచేసినప్పుడు వారిని గ్రామస్తులు మూకుమ్మడిగా ప్రతిఘటించేవారు. పురుషులు వడిసెలు విసురుతుంటే- పక్కనే నిలబడి స్త్రీలు రాళ్ళందించేవారు. మల్లారెడ్డిగూడెం అనే ఊళ్లో ఇలా ప్రతిఘటన సాగుతున్నప్పుడు పోలీసులు కాల్పులకు తెగించారు. ఒక స్త్రీ ఆ కాల్పులకు బలైంది. భారత సైన్యాలు పురుషులను లారీల్లో ఎక్కించుకుపోతుంటే- అడ్డం పడి నిలిచేవారు మహిళలు. ‘వారిని తీసుకెళ్లొద్దు.. తీసుకెళితే మమ్మల్నీ తీసుకెళ్లండి…’ అని నిలేసేవారు. ఆ విధంగా పురుషులకు రక్షణగా నిలబడేవారు.
ఓసారి హుజూర్‌నగర్‌ తాలూకాలోనూ, మిర్యాలగూడెంలోనూ పోలీసులు పురుషులను పట్టుకొని లారీల్లో ఎక్కించారు. స్త్రీలందరూ లారీలను చుట్టుముట్టారు. పురుషులను విడుదల చేయాలని పట్టుబట్టారు. పోలీసులు పదేపదే లాఠీచార్జీ చేసినా వారు జంకలేదు. గత్యంతరం లేక వాళ్ళను అక్కడే వదిలేసి, వెళ్ళిపోవల్సి వచ్చింది.
మరోసారి గోదావరి అడవుల్లోని గుండాల కోయగూడెంలో పోలీసులు చాలామంది పురుషులను పట్టుకుని, తీసుకుపోతుండగా… పక్కనేవున్న 10 గూడేల నుంచి స్త్రీలు కదిలి వచ్చారు. పోలీసులను చుట్టుముట్టి, కాల్పులు సాగించారు. అయినా చెట్ల చాటు నుంచి రాళ్ళు విసురుతూ పోలీసులను నిలేశారేగానీ వారు చెదిరిపోలేదు. చివరికి పోలీసులు పురుషులను వదిలి, వెళ్ళక తప్పలేదు.

ailamma

కట్టగూడెం అనే కోయపల్లెపై మిలటరీ దాడి చేసినప్పుడు, స్త్రీలు, పురుషులు కలిసి ప్రతిఘటించారు. ఒక సుబేదారు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆరోజుకు పారిపోయిన సైన్యం మర్నాడు పెద్ద బలగంతో విరుచుకుపడింది. గూడెం ప్రజలు మొత్తంగా అడవి లోపలికి వెళ్ళి, తలదాచుకోవల్సి వచ్చింది. ఆ సందర్భంలో స్త్రీలు చూపిన ఓర్పు, సహనం, దీక్ష మరపురానివి.
రాజారం కేంద్రంలో గెరిల్లాలకు సహాయపడుతున్నారన్న నెపంతో లంబాడీ దంపతులను పోలీసులు తీసుకెళ్ళారు. దళ రహస్యాలు రాబట్టేందుకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా వారిని ఎండలో నిలబెట్టారు. స్పృహ తప్పి పడిపోతే కాసిని నీళ్ళిచ్చి, మళ్ళీ నిలబెట్టేవారు. ఇంతగా బాధించినా వారు ఒక్క రహస్యం కూడా చెప్పలేదు.

sneha గెరిల్లా దళాలో, పార్టీ నాయకులో తమ ఇళ్ళల్లో తలదాచుకుంటుంటే, ఆ ఇంటి స్త్రీలు కంటికి రెప్పలా కాపాడేవారు. అవసరమైతే రాత్రల్లా స్త్రీలు జాగారం చేస్తూ కాపలా కాసేవారు. ఎంత రాత్రివేళ దళాలు వచ్చినా, ఎంతో ఆప్యాయంగా భోజన సదుపాయాలు సమకూర్చేవారు. దళాలు అడవుల్లో ఉంటే వారికి ఆహారం తీసుకువెళ్ళేవారు. పోలీసులకు చిక్కితే ఎన్నో చిత్రహింసలకు, అవమానాలకు గురయ్యేవారు. ఆ మహత్తర పోరాటానికి అండగా వారు వాటన్నింటినీ భరించేవారు.
ఓసారి రాజమ్మ అనే మహిళా రైతును పోలీసులు పట్టుకున్నారు. దళాలకు అన్నం తీసుకువెళ్తున్నదని ఆమెపై ఆరోపణ! ఇనుపకడ్డీలు కాల్చి ఆమెకు, ఆమె భర్తకూ వాతలు పెట్టారు. ఆమె రొమ్ముపై, మెడ మీద, చేతుల మీద వాతలు పెట్టారు. అయినా దళాల గురించి ఒక్కమాట కూడా వారి నోటి నుంచి బయటకు రాలేదు.
నేరెడ గ్రామం ఉద్యమానికి బలమైన కేంద్రం. అప్పటి డిఎస్పీ శ్రీనివాసరావు, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటర్‌ వెల్లోడి దాన్ని తగులబెడతామని బెదిరించారు. ఒకసారి ఆ గ్రామంలో 70 మంది స్త్రీలను పట్టుకుని, చింత బరికలతో బాదారు. ఆ కిరాతకులు అంతటితో ఆగలేదు. మహిళలకు పైజమాలు తొడిగించి పాదాల వద్ద గట్టిగా బిగకట్టి.. పైజామా లోపలికి తొండలను వదిలారు. ఆ సమయంలో ఆ మహిళామూర్తుల బాధ వర్ణనాతీతం. ఆ తరువాత తొండ చేసిన గాయాలపై కారం చల్లారు. అయినా, ఆ మహిళలు పోలీసులకు లొంగలేదు. మరొక రోజున మిలటరీ వాళ్ళు స్త్రీలను నిర్బంధించి, తమ పసిబిడ్డలకు పాలివ్వనీయలేదు. ఆ పిల్లలు తల్లి పాలకోసం ఒకటే ఏడుపు! అయినా, ఈ స్త్రీ లెవ్వరూ ఏ రహస్యమూ చెప్పలేదు.
ఇదే గ్రామంలో ఒకసారి ఒక దళ నాయకుడు ఉండగా, పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు మహిళలు ఆ నాయకుడికి ఆడపిల్ల వేషం వేసి, ‘పెద్దమనిషి’ అయినట్లు లోపల కూర్చోపెట్టి, పోలీసులను ఏమార్చారు. పోలీసులు వెళ్ళిన తర్వాత, ఆ దళ నాయకుణ్ణి మరొక రక్షణ స్థావరానికి తరలించారు.
ఎందరో వీరనారులు
లచ్చమ్మ … నడిగడ్డ గ్రామం చాకలి. దళాల బట్టల్ని ఉతికేది. ఆహారం చేరవేసేది. ఒకసారి భారత సైన్యానికి పట్టుబడింది. ఆ దుర్మార్గులు ఆమెను వివస్త్రను చేసి, తల్లకిందులుగా చెట్టుకు వేలాడదీసి, లాఠీలతో, బెత్తాలతో తీవ్రంగా కొట్టి హింసించారు. ‘రాములమ్మ అనే ఉద్యమకారిణి ఎక్కడుందో’ చెప్పమని వేధించారు. అయినా, లచ్చమ్మ నోరు విప్పలేదు. చివరికి విసిగి ఆమెను వదిలేశారు. దళాలు, స్థానిక పార్టీ అభిమానులు ఆమెకు జాగ్రత్తగా వైద్యం చేయించిన పిదప కోలుకుంది.
కొన్నిరోజులకు లచ్చమ్మ బట్టలుతుక్కుంటుంటే ఆ దారిన వెళ్తూ రాములమ్మ కన్పించింది. లచ్చమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళి, సంతోషంతో ఆమెను కౌగలించుకుంది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి ఆదరించింది. రాములమ్మ రాక విషయం తెలిసి ఊళ్లో మహిళలు అందరూ సంతోషంగా అక్కడికి చేరారు. పోలీసులు లచ్చమ్మను పెట్టిన బాధలన్నీ రాములమ్మకు చెప్పి… లచ్చమ్మలాంటి స్త్రీ తమ గ్రామంలో ఉన్నందుకు ఎంతో గర్వపడ్డారు.
జైనాబీ … రాజారం గ్రామంలో ఒక పేద మహిళ. చిన్నతనానే భర్త పోయాడు. ఒక్క కొడుకు, తమ్ముడు, తానూ కూలికిపోయి దాని మీద బతికేవారు. చల్లా సీతారామిరెడ్డి – ఆదిరెడ్డి దళం ఆ దగ్గర గుట్టలనే కేంద్రంగా చేసుకుని, పనిచేస్తుండేది. ఆ దళానికి ఆహారం అందించి వస్తుండేది జైనాబీ. భారత సైన్యాలు వచ్చిన తర్వాత ఆ ఊళ్లో ఒక మిలటరీ క్యాంపు పెట్టారు. అయినా, జైనాబీ భయపడకుండా, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దళాలకు ఆహారం అందజేసేది.
ఒకరోజు మిలటరీ ఆమె ఇంటిపై దాడిచేసి, ఆమెను బాది… సీతారామిరెడ్డి ఆచూకీ చెప్పమని వేధించారు. ‘నాకు తెలియదు’ అన్నది ఒక్కటే ఆమె జవాబు. జమేదారు ఆమెను బూటుకాళ్ళతో తొక్కాడు. ఆ హింసాకాండకు తట్టుకొని నిలిచి, మళ్ళీ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంది ఆమె.
పొద్దుటూరు ప్రాంతంలో జమేదారు అరాచకాలు తీవ్రంగా ఉండేవి. అతడూ, సీతయ్య అనే కిరాయి గూండా కలిసి ఒక్కరోజునే ఏడుగురు ఉద్యమకారులను చంపించారు. దీంతో, వీళ్ళిద్దర్నీ హతమార్చే ప్రణాళికతో ఒక దళ నాయకుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతడికి ఒక ముస్లిం కుటుంబం ఆశ్రయం ఇచ్చింది.
ఇంతలో దళ నాయకుడి కొరియర్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. విషయం బయటపడితే ఆ కుటుంబానికి ప్రమాదమని దళ నాయకుడు భావించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక నెల తర్వాత ఆ ఇంట్లోనే బస చేసి, ఆ జమేదారును, సీతయ్యను మట్టుబెట్టాడు.
మల్లికాంబ : ఖమ్మం జిల్లా సుద్దేపల్లికి చెందిన మల్లికాంబ పార్టీకి ఎంతో సహాయకారిగా ఉండేది. రజాకార్లు ఎన్నోసార్లు ఇంటిపై దాడిచేసి, ఆమెను హింసించారు. ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు దళాలకు మందులు కొనేందుకు విజయవాడ వెళ్తే పోలీసులు అరెస్టు చేశారు. మునగాల క్యాంపులో చిత్రహింసలు పెట్టి చివరికి ఖమ్మం ‘బోనుకు’ తీసుకువెళ్ళారు. తల్లిని కూడా క్యాంపుకు తీసుకువెళ్ళి, నాలుగు రోజులపాటు యమ యాతనలు పెట్టారు. ఆమె పంటలన్నీ నాశనం చేశారు. అయినా ఆమె మాత్రం బెదిరిపోలేదు.
ఎర్రమ్మ : హూజూర్‌నగర్‌ తాలూకా రంగాపురానికి చెందిన ఎర్రమ్మ తన కుమార్తె అనసూయను పార్టీ నాయకుడు మేదరమెట్ల సీతారామయ్యకిచ్చి వివాహం చేసింది. రంగాపురంలో తన తల్లి రంగమ్మ, తానూ ఇంకో చిన్న కుమార్తెతో ఉండేది. తొలుత రజాకార్లు ఆమె ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేశారు. పొలాలను బీడుగానే ఉంచేట్లు చేశారు. రజాకార్లను అణచివేసిన తర్వాత, రక్తపాతం జరపటం, చిత్రహింసలు పెట్టటం, భారతసైన్యాల వంతయింది. ఎర్రమ్మ కుటుంబం పదేపదే దాడికి గురైంది. ఓరోజు ఊరిలో కొందరితోపాటు ఎర్రమ్మను, ఆమె తల్లిని, బిడ్డ అనసూయను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని క్యాంపుకు తీసుకువెళ్ళి తిట్టి, కొట్టి, చివరకు మంగలి వాళ్ళచేత జుట్టు తీయించి అవమానించారు. మంగళ్ళు కూడా మొదట్లో ఆ పనికి అంగీకరించకపోతే, వాళ్ళని చితక బాదించారు. ఎర్రమ్మ కుటుంబానికి జరిగిన అవమానానికి గ్రామం మొత్తం ఆగ్రహావేశాలకు గురైంది. అయినా, ఏమీ చేయలేని పరిస్థితి!
ఎర్రమ్మ కుటుంబం రంగాపురం వదిలిపోవల్సి వచ్చింది. ఏ బంధువుల ఇంట తలదాచుకున్నా.. అక్కడా మిలిటరీ దాడి చేసేది. అయినా ఆ కుటుంబం భయపడలేదు. వేదాద్రి వెళ్ళి దేవాలయం దాపున ఒక గుడిసెలో తలదాచుకున్నారు. పోలీసులు అక్కడా ఎక్కువకాలం ఉండనివ్వలేదు. అనసూయ గుంటూరులో పొగాకు కంపెనీలో పనిచేస్తూ, కాలం గడిపింది. పోరాట విరమణ తర్వాత వారంతా స్వగ్రామం తిరిగి వచ్చారు.
వెంకమ్మ : నందిగామ తాలూకా సరిహద్దులోని చొప్పకట్లవారి పాలేనికి చెందిన ధనికరైతు రత్తయ్య భార్య వెంకమ్మ. గెరిల్లా దళాలకు ఆమె భోజన సదుపాయాలు చూసేది. గాయపడ్డవారికి రహస్యంగా వైద్య సహాయం చేయించేది. భారత సైన్యాలు ఆమె ఇంటిపై దాడి చేసి, రత్తయ్యను ఖమ్మం క్యాంపుకు తీసుకువెళ్ళింది. వెంకమ్మను అవమానపరచి చివరకు అత్యాచారం చేసింది. ఆ అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఆనాడు ఎన్ని కుటుంబాలు ఇలా అవమానాన్ని, బాధల్ని భరించాల్సి వచ్చిందో! ఎంతమంది స్త్రీ మూర్తులు అమ్మల్లా పోరాటాలకు పురుడు పోశారో..! ఎన్నెన్ని త్యాగాలతో ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకున్నారో!
చెలరేగిన మృగత్వం..చెక్కుచెదరని ధీరత్వం..
1946-47లో నిజాం పోలీసులు, అధికారులు జనగామ తాలూకాలోని ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలపై దాడిచేసి పదీ, పదిహేను మంది స్త్రీలను దారుణంగా అత్యాచారం గావించారు. కాంగ్రెస్‌ వారు కూడా ఈ విషయం చాలా దారుణం అని, స్త్రీ భారతదేశానికే అవమానమని ఖండించక తప్పలేదు. సరోజినీనాయుడు కుమార్తె పద్మజానాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. దేశం మొత్తం మీద ఈ ఘటనకు నిరసన ప్రకటించింది.
మునగాల పరగణాలో 50 మంది స్త్రీలను, ఆంధ్రప్రాంతంలో 25 మందిని, హుజూర్‌నగర్‌ – మిర్యాలగూడ ప్రాంతంలోని నీలాయగూడెంలో 21 మందిని, మానుకోట తాలూకా బలపాలలో 15 మందిని, ఇల్లెందు తాలూకా సీమపాడులో 70 మందినీ, నర్మెట, సంగనూర్‌ (జనగామ తాలూకా)లలో కలిపి 80 మంది స్త్రీలను పోలీసులు అత్యాచారం చేశారు.
పిండిప్రోలు వద్ద ఖానాపురం కేంద్రంలో పార్టీ కార్యకర్త భార్యను ఎత్తుకుపోయారు. సూర్యాపేట తాలూకా నాగారంలో, కాంగ్రెస్‌ ఏజంటు చూపించిన ఒక స్త్రీని మిలటరీ పశువులు ఎత్తుకుపోయి, క్రూరంగా అత్యాచారం చేసి, ఆమె చనిపోతే, శవాన్ని రోడ్డుపక్క పారేశాయి. పచ్చిబాలింతలపై అత్యాచారానికి పాల్పడ్డాయి.
ఈ క్రౌర్యానికి వ్యతిరేకంగా మహిళలు నిరంతరాయంగా పోరాటం సాగించారు. ఎన్నోసార్లు పోలీసుల దుర్మార్గం నుండి తమను తాము రక్షించుకున్నారు. జనగాం తాలూకాలోని వడ్డిచెర్ల గ్రామానికి నల్గురు సైనికులు పౌరదుస్తులలో వెళ్ళి స్త్రీలను అత్యాచారం చేశారు. ఇది తెలిసి ఊరూరంతా అట్టడికిపోయింది! సైనికులు విడిది చేసిన ఇంటిపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడిచేశారు. ఇద్దరు సైనికులు పారిపోగా ఇద్దరిని హతమార్చారు. తరువాత నవాబ్‌పేట క్యాంపుకు కబురు జేశారు. మిలటరీ జనరల్‌ నంజప్ప జనగామ వస్తే … ఈ గ్రామ ప్రజలు అతనిని కలుసుకొని ‘మీ వాళ్ళు మా స్త్రీలను అవమానించారు. మేం వారిని చంపాము’ అని ధైర్యంగా చెప్పారు.

women self

తమను తాము రక్షించుకున్నారు!
ప్రొద్దుటూరు గ్రామంపై మిలటరీ దాడిచేసి ప్రజలను తీవ్రంగా హింసించి, నలుగురు యువకుల్ని కాల్చి చంపారు. తర్వాత స్త్రీలను చెరబట్టేందుకై ప్రయత్నించారు. గ్రామంలోని స్త్రీలంతా వచ్చి, మిలటరీని చుట్టుముట్టి వారి బారినుండి తమ సాటి స్త్రీలను రక్షించుకున్నారు.
భట్టు వెంకన్న బావి లంబాడీ తండాలో స్త్రీలను అత్యాచారం చేయడానికి సైనికులు ప్రయత్నించారు. స్త్రీలూ, పురుషులూ అందరూ కలసి ప్రతిఘటించారు. తిరుమలగిరిలో ఒక వడ్రంగి భార్యను బలవంతం చేయబోయాడొక మిలటరీ వాడు. వడ్రంగి బాడితతో ప్రతిఘటించగా, వాడు పారిపోయాడు. కోయగూడెంలో ఇద్దరు పోలీసులు ఒక ఇంట్లో మగవాళ్ళులేని సమయంలో చొరబడ్డారు. ఆ ఇంటి ఆడవాళ్ళు, చుట్టుపక్కల స్త్రీలు కలిసి చేటలు తీసుకుని వొళ్ళు హూనం అయ్యేదాకా పోలీసుల్ని కొట్టారు. ఇంతలో మగవాళ్ళు వచ్చి తన్ని తరిమేశారు.
సర్వతోముఖంగా … సమరశీలంగా …
రాజకీయంగానూ, సాయుధ పోరాటంలోనూ ఎన్నో కార్యక్రమాలను మహిళలు అంకితభావంతో నిర్వర్తించారు. అడవుల్లోనూ, మైదానాల్లోనూ ఎంతో ప్రతిభావంతంగా ముందుండి నడిపించారు.

mallu swarajyam

కామ్రేడ్‌ స్వరాజ్యం : 1945 నుంచి యువతిగా వుండగానే ఆమె ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలలో చాలా ఉత్సాహంగా పని చేసింది. స్త్రీలను, పురుషులను పోరాటాల్లోకి తీసుకువచ్చింది. గోదావరి అడవుల్లో ఆయుధం చేపట్టి, మూడేళ్ల పాటు పనిచేసింది. గుండాల కేంద్రంలో కోయలను ఉత్తేజపరచి వారిని పోరాటంలోకి దింపింది. భూస్వామి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రజలందరిలో చొచ్చుకుపోయి, వారిలో ఒకరుగా పనిచేసింది.
కామ్రేడ్‌ రాములమ్మ : నల్గొండ తాలూకా చెరుకపల్లి ఈమె గ్రామం. భర్తతో పాటు 1946లో పార్టీలోకి వచ్చింది. రాములమ్మ భర్త 1948లో, కొన్ని బలహీనతలవల్ల పార్టీని విడిచిపెట్టాడు. ఆమె మాత్రం ప్రజలకు సేవ చేస్తూ, పార్టీలో కొనసాగింది. ఉద్యమంలో కొరియర్‌గా చాలా నేర్పుగా వ్యవహరించి, పార్టీ కేంద్రానికి, ప్రజలకు మధ్య సజీవ సంబంధాలు నిలిపింది. ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులలోంచి ఈమె ఒక ముఖ్య కార్యకర్తను రక్షించి, పార్టీ కేంద్రానికి తీసుకువచ్చింది.
పల్నాడు తాలూకా తాళ్ళపల్లి గ్రామానికి ఆమె ఒకసారి పనిమీద వెళ్ళింది. అక్కడ కొందరు ధనిక రైతులు ఆమెను మభ్యపెట్టి పోలీసులకప్పగించారు. ఆమె అరెస్టయిందని తెలియగానే చూడటానికి వందలాది మంది స్త్రీలు గుమిగూడారు. అప్పుడామె ఉత్తేజపూరితమైన ఉపన్యాసం ఇచ్చింది. అది విన్న వారికి ఆమె ఉద్యమం పట్ల ఎంతో సానుభూతి కలిగింది. 1951లో ఆమె జైలు నుంచి విడుదలై పార్టీలో చురుగ్గా పనిచేసింది.
సావిత్రమ్మ : ఈమెను హూజూర్‌నగర్‌ మండల కమిటీ పార్టీలోకి తీసుకుంది. నిజాం రజాకార్‌ వ్యతిరేక పోరాట రోజుల నుంచి పార్టీకి సహకరించేది. భారత సైన్యం ప్రవేశించిన తరువాత ఆమెను రెండుసార్లు జైల్లో పెట్టారు. విడుదల చేశాక … ఐదు రోజుల పాటు వెతుక్కుంటూ దళాల వద్దకు చేరింది. ఒకసారి దళ కేంద్రానికి నీరు తీసుకువెళుతుంటే- పోలీసులు ఆమెను పట్టుకున్నారు. చిత్రహింసలు పెట్టారు. కానీ ఆమె ఒక్క రహస్యమన్నా చెప్పలేదు.

ఉద్యమం కోసం అల్లుడినే కాదనుకొంది!
సూర్యాపేట తాలూకాలో చిల్పకుంటకు చెందిన లింగమ్మ … భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందుంది. తన కుటుంబం మొత్తం ఉద్యమంలో చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహించింది. పోరాటానికి పూర్వమే తన కుమార్తెను లింగారెడ్డికిచ్చి పెళ్ళి చేసింది. అతడిని ఉద్యమంలోకి ప్రోత్సహించింది. లింగారెడ్డి దళనాయకుడయ్యాడు. చాలాసార్లు జన్నారెడ్డి గుండాలను తరిమికొట్టాడు. కానీ, 1952 ఎన్నికల్లో లింగారెడ్డి ఆ భూస్వామితో లాలూచీపడ్డాడు. దీంతో, లింగమ్మ అల్లుణ్ణి ఇంటికి రానీయలేదు. తాను, తన కూతురు కలిసి, తన అల్లుడు బలపరుస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తీవ్రంగా పనిచేసి, ఓడించారు. తరువాతి కాలంలో లింగారెడ్డి తన పొరపాటు తెలుసుకుని ప్రజా ఉద్యమాల్లోకి వచ్చాడు. అప్పుడే లింగమ్మ అల్లుణ్ణి తన గడప తొక్కనిచ్చింది.

మహాతల్లి మంగ్లీ
హాము – మంగ్లీ దంపతులు ధర్మాపురం పశ్చిమాన ఉన్న లంబాడి తండాలో ఉండేవారు. వారి కుబారుడు ధానూ ఉద్యమంలో చురుగ్గా ఉండేవాడు. విసునూరు దేశముఖ్‌ కొడుకు బాబు ఒకరోజు ఆ ఊరిపై అమానుష దాడి చేశాడు. ధానూ తల్లిదండ్రులు హామూ, మంగిలీలను చిత్రహింసలు పెట్టారు. అంత బాధలోనూ మంగ్లీ దేశముఖ్‌ను నానా తిట్లూ తిట్టింది. అప్పుడు గ్రామంలోని ఐదుగురు యువకులను బంధించి, వారి చేతనేే చితులు పేర్పించి ‘ధాను’ జాడ గురించి చెప్పమని, బాధించారు. ఎంత కొట్టినా వారు నోరు విప్పలేదు. దీంతో, వారిని తుపాకితో కాల్చి, చితిపై వేసి దహనం చేశారు. అందులో ధానూ అన్న, హాము-మంగిలీ కొడుకు సోమ్లా కూడా ఉన్నారు.
మరి కొన్నాళ్లకు మంగ్లీని తీవ్రంగా హింసించారు. ఆమె కళ్ల ముందే ముగ్గురు యువకులను కాల్చి చంపారు. ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా ఆమె లొంగలేదు. ఆమె నలుగురు కొడుకుల్నీ జైల్లో పెట్టారు. కోడళ్ళను, మనుమలను కూడా హింసించారు. అయినా ఆ దంపతులు ఎర్రజెండాను విడవలేదు. మంగ్లీ ఆ ప్రాంత ప్రజలందరికీ ఉత్తేజం కలిగించే స్త్రీగా నిలిచిపోయింది. తరువాతి కాలంలో దళాలు విసునూరు బాబును హతమార్చి ప్రతీకారం తీర్చుకున్నాయి. మంగ్లీ తుదిశ్వాస వరకూ ఎర్రజెండాకు అండగానే ఉంది. మూడేళ్ళ పాటు జైళ్ళలోనే గడిపింది. ఆమె నలుగురు కొడుకులు, మనమలు అంతా పార్టీకి ముఖ్యులుగా ఉండేలా ప్రోత్సాహం అందించింది.

మహిళలకు శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేయాలి
నరసమ్మ: 1950లో దళాల్లోకి వచ్చేనాటికి ఆమె వయస్సు 20 ఏళ్లు. చాలా చురుకైన కార్యకర్త. తనకిచ్చిన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎన్నో కొత్త పద్ధతులు, విధానాలు అవలంబించేది. అందరికీ అర్థమయ్యేలా చక్కగా చదివేది. పార్టీ అంతర్గత సమావేశంలో ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని : ”పార్టీ కార్యకర్తలకు తగిన శిక్షణ ఇవ్వాలి. శత్రువు నుంచి తప్పించుకోవటం ఎలాగో నేర్పాలి. మేము చదివి అర్థం చేసుకోగలిగిన పుస్తకాలు మాకందించాలి. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.”

”ఇప్పటికీ స్త్రీలంటే తక్కువవాళ్ళనే పురాతన దృక్పథమే కొనసాగుతోంది. మాకు మంచి శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేయాలేగాని, దిగజార్చరాదు. అసలు ప్రత్యేకంగా శత్రువులపై జరిపే దళ చర్యల్లో ఒక స్త్రీనన్నా ఎందుకు పాల్గొననివ్వలేదు?’

Spread the love