– మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇంటింటా ప్రచారం
నవతెలంగాణ -వెల్దుర్తి
నర్సాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి విజయమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆదివారం మండల పరిధిలో మంగళపర్తి, మానేపల్లి, మహమ్మద్ నగర్ తండా, అందుగులపల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిని ఆవుల రాజిరెడ్డిని గెలిపించడానికి ఇంటింటా ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అభివద్ధి పనులే చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. సబ్బండ వర్గాలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఘనత ఇందిరా, రాజీవ్ గాంధీ లదేనన్నారు. పంచవర్ష ప్రణాళికలు 20 ఆదేశ సూత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని మరోసారి గుర్తు చేశారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిందన్నారు 100% సబ్సిడీలతో నీటి వసతుల కోసం బోరు బావులను తవ్వించిందన్నారు. చదువుకున్న యువతీ, యువకులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాలను అక్కున చేర్చుకోవడానికి ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టి మొట్టమొదటగా అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అందుకు నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే ఆవుల రాజిరెడ్డికి ఓటు వేసి మీరు కూడా అక్కున చేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, తలారి మల్లేష్, హనుమేష్, పోతిరెడ్డి ఉన్నారు.