ఏచూరికి జాతీయ, అంతర్జాతీయ నేతల ఘన నివాళి

National and international leaders paid tribute to Yechuri– తమ జ్ఞాపకాలను పంచుకున్న విదేశీ ప్రతినిధులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి జాతీయ, అంతర్జాతీయ నేతలు ఘన నివాళి అర్పించారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలు దేశాల ప్రతినిధులు కూడా ఏకేజీ భవన్‌కు చేరుకున్నారు. నేపాల్‌ మాజీ ప్రధాన మంత్రి మాధవ్‌ కుమార్‌ నేపాల్‌, భారత్‌లో చైనా రాయబారి ఝూ హైహాంగ్‌, రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌, వియత్నాం రాయబారి గుయెన్‌ థాన్‌ హై, సిరియా రాయబారి డా. బాసిమ్‌ అల్‌ ఖతీబ్‌, పాలస్తీనా రాయబారి అద్నాన్‌ అబు అల్హయ్జా, క్యూబా రాయబారి (చార్జ్‌ డి ఎఫైర్స్‌) అబెల్‌ అబెల్లె డెస్పాయిగే తదితరులు ఏచూరికి కడసారి నివాళులు అర్పించిన తర్వాత సందర్శకుల డైరీలో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ భారత్‌-రష్యా స్నేహబంధాన్ని బలోపేతం చేసేందుకు సీతారాం ఏచూరి విశేష కృషి చేసిన నాయకుడని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏచూరి వ్యక్తిగతంగా సన్నిహితుడని, ఆయన అకాల నిష్క్రమణ తీరని లోటు అని డెనిస్‌ అలిపోవ్‌ అన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా నేపాలీ ప్రజలు చేస్తున్న పోరాటాలకు గొప్ప మద్దతునిచ్చిన నాయకుడు ఏచూరి అని మాధవ్‌ కుమార్‌ తన నేపాల్‌ విజిటర్స్‌ డైరీలో రాశారు. సిరియా రాయబారి బాసిమ్‌ అల్‌ ఖతీబ్‌ ఏచూరి సిరియాకు శ్రేయోభిలాషి, సన్నిహిత మిత్రుడని పేర్కొన్నారు. తన సిద్ధాంత వైఖరిని ఆయుధంగా చేసుకుని బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడని, అలాంటి సోదరులను పోగొట్టుకున్నప్పుడు జీవితం కష్టమనే వాస్తవికత వెల్లడవుతుందని తెలిపారు. చైనా ప్రజలకు అత్యంత ఆప్తమిత్రుడు ఏచూరి అకాల మరణం పట్ల చైనా రాయబారి ఝూ హేహాంగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌-చైనా సంబంధాలను బలోపేతం చేసేందుకు ఏచూరి అందించిన అమూల్యమైన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పార్టీ ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్‌కు పెద్ద ఎత్తున జాతీయ రాజకీయ, సామాజిక ప్రముఖులు చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్‌ నేతలు పి చిదంబరం, జైరాం రమేష్‌, రాజీవ్‌ శుక్లా, సచిన్‌ పైలట్‌, మణిశంకర్‌ అయ్యర్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, డీఎంకె నేతలు ఉదయనిధి స్టాలిన్‌, దయానిధి మారన్‌, టిఆర్‌ బాలు, కనిమొళి, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత విజరు వడేటివార్‌, ప్రబీర్‌ పుర్కాయస్థ, ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజరు సింగ్‌, రాఘవ్‌ చద్దా, గోపాల్‌ రారు, ఆర్‌జెడి నేత మనోజ్‌ కుమార్‌, ఝా, సీపీఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్‌, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య, కేరళ కాంగ్రెస్‌ నాయకుడు జోస్‌ కె మణి, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ పిడిటి ఆచారి, మాజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ వజాహత్‌ హబీబుల్లా, చరిత్రకారిని రొమిలా థాపర్‌, ప్రొఫెసర్‌ జి.ఎన్‌ సాయిబాబా, స్వరాజ్‌ అభియాన్‌ యోగేంద్ర యాదవ్‌, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఏచూరి మాజీ భార్య ఇంద్రాణి మజుందార్‌, వివిధ దేశాల రాయబారులు వచ్చి నివాళులర్పించారు. ముస్లిం లీగ్‌ ఎంపిలు పికె కున్హాలికుట్టి, ఇటి మహ్మద్‌ బషీర్‌, హారిస్‌ బిరాన్‌, సిపిఐ ఎంపిలు పి సంతోష్‌ కుమార్‌, పిపి సునీర్‌, మహిళా ఫెడరేషన్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, ఐఎన్‌ఎల్‌ ప్రధాన కార్యదర్శి సులైమాన్‌ సేథ్‌, ఢిల్లీ ఆర్చ్‌ బిషప్‌ అనిల్‌ కుటో, శాంతిగిరి ఆశ్రమ ప్రధాన కార్యదర్శి స్వామి గురురత్నం జ్ఞాన తపస్సీ, జమాత్‌ ఇస్లామీ అమీర్‌ టి ఆరిఫ్‌ అలీ, ప్రొ. కెవి థామస్‌, కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ ప్రభు కూడా నివాళులర్పించారు.
సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నేతల ఘన నివాళి
పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌, పినరయి విజయన్‌, బృందాకరత్‌, మాణిక్‌ సర్కార్‌, బివి రాఘవులు, ఎంఏ బేబీ, సుభాషిణి అలీ, మహమ్మద్‌ సలీం, అశోక్‌ ధావ్లే, రామచంద్రదోమ్‌, తపన్‌ సేన్‌, జి. రామకృష్ణన్‌, నీలోపాల్‌ బసు, ఎ విజయరాఘవన్‌, ఎంవి గోవిందన్‌లు నివాళులర్పించారు. సీనియర్‌ నేతలు బిమన్‌ బోస్‌, హనన్‌ మొల్లా, పి కరుణాకరన్‌, కేరళ నుంచి కేంద్ర కమిటీ సభ్యులు ఇపి జయరాజన్‌, టిఎం థామస్‌ ఐజాక్‌, పికె శ్రీమతి, కెకె శైలజ తదితరులు కూడా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.
సీపీఐ(ఎం) ఎంపీలు కె. రాధాకృష్ణన్‌, అమ్రారామ్‌, ఎస్‌.వెంకటేశన్‌, సచ్చితానందం, జాన్‌ బ్రిటాస్‌, వి.శివదాసన్‌, ఎఎ.రహిమ్‌ పుష్పగుచ్ఛాలు ఉంచారు. కేరళ మంత్రులు కెఎన్‌ బాలగోపాల్‌, పి రాజీవ్‌, సాజి చెరియన్‌, మహ్మద్‌ రియాజ్‌, ఎంబి రాజేష్‌, విఎన్‌ వాసవన్‌, ఆర్‌ బిందు, రామచంద్రన్‌ కదనపల్లి, స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ తదితరులు నివాళులర్పించారు. సీనియర్‌ నేత విఎస్‌ అచ్యుతానందన్‌ తరపున ఆయన కుమారుడు విఎ అరుణ్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందించారు.
సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె హేమలత, ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం దావలే, కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, డీవైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమగ్నా భట్టాచార్య, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు జెక్‌ సి థామస్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను, ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌ పుష్పగుచ్ఛాలు అందించారు. సహమత్‌, జననాట్య మంచ్‌, జనసంస్కృతి, వరల్డ్‌ మలయాళీ అసోసియేషన్‌ కార్యకర్తలు నివాళులర్పించారు.
తెలుగు రాష్ట్రాల నేతల నివాళి
సీతారాం ఏచూరికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు నివాళి అర్పించారు. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ కెఆర్‌ సురేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు జెడి శీలం, చింతా మోహన్‌, సామాజిక కార్యకర్త బెజివాడ విల్సన్‌, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు నివాళి అర్పించారు.

Spread the love