నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర యోగా అధ్యయన పరిషత్ సభ్యులు , తెలంగాణ రాష్ట్ర యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ప్రముఖ యోగశిక్షకులు తోట సతీష్ ను 2023 సంవత్సరానికి గాను జాతీయ బెస్ట్ టెక్నికల్ అఫీషియల్ అవార్డు వరించింది. యోగాసనా భారత్ అధ్యక్షులు ఉదిత్ సేథ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయదీప్ ఆర్య బుధవారం ఈ మేరకు ఉత్తరులను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సతీష్ కు ఈ అపూర్వ అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ (టెక్నికల్) గా వ్యవహరిస్తున్న ఆయన గత సంవత్సరం జాతీయ క్రీడలకు, ఖేలో ఇండియా గేమ్స్, ఫెడరేషన్ గేమ్స్ లలో టెక్నికల్ అఫీషియల్ గా విధులను సమర్థవంతంగా నిర్వహించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. బాల్యంలోనే యోగ సాధన తో రాటు తేలి, జాతీయస్థాయి యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్ తో మెరిశారు. తాను అభ్యసించిన విద్యను, పొందిన ఆరోగ్యాన్ని సమాజానికి అందించాలనే సంకల్పంతో గత రెండు దశాబ్దాల నుంచి నిరంతరంగా యోగశిక్షణా తరగతులను సిద్దిపేట కేంద్రంగా నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ యోగా తరగతులు నిర్వహించి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాలలోని వేలాది మందికి భారతీయ యోగశిక్షణను అందించారు. రిషికేష్ , బెంగళూరు , హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రత్యేక యోగా శిక్షణతోపాటు వివిధ థెరపీలలో శిక్షణను అభ్యసించారు. వివిధ రకాల వ్యాధులకు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహిస్తూ, వారి అనారోగ్యాలను దూరం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.