– పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి : ఢిల్లీ జేఎఫ్‌ఎంఈ ధర్నాలో నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేదలకు విద్యను దూరం చేయడంతోపాటు దేశ సమగ్రతకు నష్టాన్ని చేకూర్చే జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని వెంటనే రద్దు చేయాలని పలువురు రాజకీయ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు సంబంధించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాయింట్ ఫోరమ్ ఫర్ మూవ్‌మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ (జేఎఫ్‌ఎంఈ) ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి విశ్వవిద్యాలయాలు, కాలేజీల నుంచి అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్‌బసు, సీఐటీయూ కార్యదర్శి తైవాన్ సైన్ హాజరై మద్దతు ప్రకటించారు. విద్యను వ్యాపారమయం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ఎన్‌ఈపీ వల్ల తీవ్ర నష్టమని వారు విమర్శించారు. దేశ సమైక్యతకు భంగం కలిగిస్తూ లౌకిక విలువలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని అన్నారు. విద్యార్థుల మెదళ్లలో మత భావనలను నింపడానికే అది ఉపయోగపడుతుందన్నారు. ఎన్‌ఈపీని రద్దు చేసే వరకు పోరాడతామని అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో చెప్పారు. ఉద్యోగుల హక్కుగా ఉన్న పాత పెన్షన్‌ని బిక్షగా మార్చి చందాతో కూడిన జాతీయ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి, ఉద్యోగుల సామాజిక భద్రతను ఆందోళనకరంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్ చేశారు. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం జీపీఎస్ అంటూ మసిపూసి మారేడు కాయ చేసినా అంగీకారం కాదన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ మినహా ప్రత్యామ్నాయం ఏదీ లేదని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పేరు పెట్టినా, పాత పెన్షన్ విధానానికి సాటి రావనీ, వెంటనే ఆ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గత ఆరేండ్లుగా ఈ ప్రభుత్వాలు పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయలేదని చెప్పారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ మొత్తాన్ని వెంటనే పర్మినెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి పరీక్షల విధానం పేరుతో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న రాజ్యాంగబద్ధ స్వేచ్చను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ లాంటి పరీక్షలు రద్దు చేయాలన్నారు. విద్యను, విశ్వవిద్యాలయాలను ప్రయివేటీకరణ నుంచి రక్షించాలని కోరారు. పాఠశాల నుంచి కళాశాల వరకు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి, ఉపాధ్యక్షులు చావ రవి, మహవీర్‌తోపాటు జేఎఫ్‌ఎంఈ భాగస్వామ్య సంఘాల జాతీయ నాయకులు ఇంద్రశేఖర్, అజిత్ నారాయణ మిశ్రా, అరుణకుమార్, మహంతి మిశ్రా, గుప్త, ఎంబీ సత్యం, కె నరసింహారెడ్డి తదితరులతోపాటు తెలంగాణ నుంచి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, నాయకులు అరుణకుమారి, నక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.