10న జాతీయ లోక్‌ అదాలత్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల పదో తేదీన (రెండో శనివారం) జాతీయ లోక్‌ అదాలత్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది. అన్ని రకాల సివిల్‌ కేసులు, రాజీ పడ దగిన క్రిమినల్‌ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు వంటి వాటి పరిష్కారం కోసం ఈ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో కేసులకు సంబంధించి సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని వేగంగా పొందడంతోపాటు చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందే అవకాశముంటుందని పేర్కొంది. సుప్రీం కోర్టు నుంచి కింది స్థాయి కోర్టులన్నింటిలో కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈనెల పదో తేదీన భౌతిక లేదా వర్చువల్‌ పద్ధతుల ద్వారా జరగబోయే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన, ఖర్చు, కాలయాపన లేకుండా అప్పీలు లేని అంతిమ తీర్పును పొందొచ్చని సూచించింది. ప్రజలు, కక్షిదారులకు దగ్గరలోని కోర్టు ఆవరణలో గత న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని కోరింది. ఇతర వివరాలకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 15100 లేదా కార్యాలయ ఫోన్‌ నెంబర్‌ 040-23446723 ద్వారా పొందొచ్చని సూచించింది.

 

Spread the love