ఓటు వినియోగంతోనే దేశాభివృద్ధి

– కొత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ
– తిమ్మాపూర్‌లో ఓటరు చైతన్య యాత్ర
నవతెలంగాణ-కొత్తూరు
ఓటు వినియోగంతోనే దేశాభివృద్ధి సాధిస్తుందని కొత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ అన్నారు. ఎన్నికల సమీప వేళ ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్య కలిగించేందుకు సోమవారం ఆయన తిమ్మాపూర్‌లో ఓటరు చైతన్య యాత్ర నిర్వహించారు. శానిటేషన్‌ సిబ్బంది, మెప్మా సిబ్బంది, కార్యాలయ సిబ్బంది నూతన ఓటర్లతో కలిసి ఆయన తిమ్మాపూర్‌ గాంధీ విగ్రహం నుంచి, తిమ్మాపూర్‌ చౌరస్తా వరకూ ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నికల్లో ప్రజలంతా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటును అమ్ముకోవద్దని ఓటర్లకు సూచించారు. ఓటు దేశ తలరాతను మారుస్తుందనీ, ఓటు హక్కు వినియోగంపై యువత ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ర్యాలీ అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

Spread the love