నవతెలంగాణ – కొలంబో: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా చుట్టు ముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కాట్‌మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్ లైనులో సమస్య ఏర్పడంతో సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు తెలుస్తోంది. 2022 నుంచి శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇంధనం, ఆహారపదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ కావడంతో ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీలంకలో విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది.