రెజ్లర్లకు మద్దతుగా 18న దేశవ్యాప్త ఆందోళన

ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ లైగింక వేధింపులకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా ఈనెల 18న దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని అఖిల భారత వ్యవ సాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూ యూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. శుక్రవారం ఏపీ, తెలంగాణ భవన్‌లో బి. వెంకట్‌ మీడియాతో మాట్లాడారు. రెజ్లర్లకు మద్దతుగా ఈనెల 18 నుంచి ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డీవై ఎఫ్‌ఐ తదితర సంఘాలతో దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని అన్నారు.జంతర్‌ మంతర్‌ లో మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారని, ఇది మోడీ ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, బ్రిజ్‌ భూషణ్‌ ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
ఏపీ హైకోర్టు తీర్పు హర్షణీయం
జీవో నంబర్‌ 1ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పును ఏఐఏడబ్ల్యూ యూ స్వాగతిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చాలా స్పష్టంగా కోర్టు చెప్పిందని అన్నారు. బ్రిటిష్‌ పాలనలో జాతీయ ఉద్యమాన్ని ఆపేందుకు తీసుకొచ్చిన జీవోను జగన్‌ అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు సభ పెట్టుకునే హక్కునూ కాల రాస్తున్నారని అన్నారు. జగన్‌ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీవో నంబర్‌ 1 సమయంలో చాలా మంది నేతల పై కేసులు పెట్టారని, వాటిని ప్రభుత్వం ఉపసహంరించు కోవాలని డిమాండ్‌ చేశారు. జీవో నంబర్‌ 1 విషయంలో జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఏపీకి జగన్‌ వల్లే రాజధాని కూడా లేకుండా పోయిందని, అమరావతే రాజధాని అని జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధాని లేక రైతులు ఆందోళన చేస్తున్నారని, రైతుల ఉసురు తీయొద్దని హితవు పలికారు. ఎవరైనా మీటింగ్‌ పెట్టుకుంటే అవి పెట్టకుండా పోలీసులు కేసులు పెడుతున్నారని, ఈ హక్కు ఎవరు ఇచ్చారని విమర్శించారు. ప్రజలను రోడ్లు పైకి రానివ్వడం లేదని, జగన్‌ను ఇలానే తిరగనివ్వకపోతే ఇప్పుడు ఇలా ఉండేవారా? అని ప్రశ్నించారు. రైతులు అకాల వర్షాల వలన ఇబ్బందులు పడుతున్నారని, అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు.

Spread the love