భరతనాట్యానికి నవ్యసొగసులద్దిన నాట్యమయూరి. కూచిపూడి కళాప్రాంగణ వెలుగులను దశదిశలా చాటిన నృత్యభామిని. మూడు నాట్యరీతుల ముగ్ధమనోహరి. రసహృదయులను సమ్మోహితులను చేసిన ఆ కళాదిగ్గజం. ఆమెనే ఉత్తుంగ తరంగంలా ఎగసి, ప్రపంచమంతా ప్రభంజనాలు సృష్టించిన యామినీ కృష్ణమూర్తి. అంతటి గొప్ప కళాకారిణి ఆగస్టు 3వ తేదీన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ‘కమనీయ నృత్యం కూడా ఒక కదనమే. కళాకారుల భాష అర్ధంచేసుకోలేని పదివేల మంది ప్రేక్షకులపై సమ్మోహనాస్త్రం విసిరి దారికి తెచ్చుకొవటం ఓ యుద్ధమే’ అన్న ఆమె కళా ప్రస్థానం నేటి మానవిలో…
ఆంధ్రదేశంలోని మదనపల్లెలో1940 డిసెంబరు 20న యామిని జన్మించారు. రిషివ్యాలీ పాఠశాలలో విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. తరచూ కళాకారుల రాకతో, పండిత చర్చలతో వారి ఇల్లు సందడిగా ఉండేది. ఆ కళా స్పర్శతో చిన్నారి యామిని నృత్య కళాకారిణి కావాలని కలలు కనేది. ఆమె ఇష్టాన్ని గుర్తించిన తండ్రి కూతురిని కళాకారిణిగా తీర్చిదిద్దాలని నిశ్చయించారు. యామిని నాట్య శిక్షణ కోసం వారి కుటుంబం చెన్నైకి తరలివెళ్లింది. అక్కడ రుక్మిణీదేవి అరుండేల్ స్థాపించిన కళాక్షేత్రంలో చేరారు. ఓవైపు బీసెంట్ పాఠశాలలో చదువుతూనే మరోవైపు భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
జిజ్ఞాసను గుర్తించి
రుక్మిణిదేవి యామినిని నాట్యకళా ప్రదర్శనలకు తరచూ తీసుకెళ్లేవారు. అక్కడ పెద్ద కళాకారుల అభినయాన్ని ఆసక్తితో గమనిస్తూ సాధన చేసేవారు. అప్పట్లో రుక్మిణీదేవి పండుగలు, పర్వదినాలు, జాతరల సందర్భంగా రుక్మిణీ దేవి తమిళనాట పర్యటిస్తూ ‘కురవంజి’ అనే జానపద దృశ్యరూపకాన్ని ప్రదర్శించేవారు. మన దగ్గర సోదెమ్మల కళారూపానికి దగ్గరగా ఉండే ఆ కళాంశంలో యామిని చెలికత్తెపాత్రను వేసి మెప్పించారు. ఆమెలో జిజ్ఞాసను గుర్తించిన రుక్మిణీదేవి, యామినిని తంజావూరు బృహదీశ్వరాలయానికి తీసుకువెళ్లి అక్కడ రకరకాల నృత్యరీతులను ప్రదర్శించే గొప్ప కళాకారులను పరిచయం చేశారు.
చెరగని ముద్ర
1954లో యామిని నృత్యజీవితం ఓ మలుపుతిరిగింది. చెన్నై రసికరంజని సభకు వెళ్లారు. అక్కడ బాలసరస్వతీదేవి ఇచ్చిన నాట్య ప్రదర్శన ఆమె మనసుపై చెరగని ముద్రవేసింది. ఆమె భైరవ రాగంలో ‘మోహమనే ఎందవేళై’ ఒక వర్ణానికి నత్యం చేస్తున్నారు. శాస్త్రీయ నృత్యకళ మీద అంతులేని మమకారం ఏర్పడటానికి బీజం వేసింది. నాట్య కళాకారిణి కావాలన్న ఆమె ఆకాంక్షను మరింతగా బలపరిచింది. బాలసరస్వతి శిష్యురాలిగా ఉంటూ, నట్టువాంగం చెప్పే కంచీపురం ఎల్లప్పపిళ్లరు దగ్గర భరత నాట్యరీతులను ఔపాసన పట్టారు
నృత్య కళాకారిణిగా అరంగేట్రం
ప్రతి నృత్య కళాకారిణి తన జీవితంలో అపురూపంగా భావించే సుమధుర ఘట్టం అరంగేట్రం. లయాన్వితంగా అడుగులు వేస్తూ యామిని వేదికమీదికి వచ్చింది. అందమైన ఆహార్యం, ఆకట్టుకునే అభినయాన్ని చూసి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని గురువులు గ్రహించారు. ఒక కళలో పూర్తిగా పట్టుసాధించాలన్న తండ్రి మాటలు ఆమె మనసులో నిలిచిపోయాయి. యామిని మైలాపూర్ కపిలేశ్వర ఆలయ సంప్రదాయ నాట్యంలో పేరుపొందిన కళాకారిణి మైలాపూర్ గౌరి అమ్మాళ్ వద్ద కొంతకాలం శిష్యరికంచేసి అరుదైన పదాలు, జావళీలు నేర్చారు.
మలుపుతిప్పిన సంఘటన
శంకరాభరణ రాగంలో వర్ణానికి ఆమె వేగంగా చేసిన నృత్యానికి ప్రేక్షకలోకం ఆశ్యర్యపోయింది. సంస్కృత పండితుడైన తండ్రి కృష్ణమూర్తి పేర్చిన పదాలను యామిని నృత్యరూపకంగా కూర్చారు. అలా ఒక్కో పదానికి, వర్ణానికి నర్తిస్తూ దేశమంతా గుర్తింపు పొందుతున్నారు. భరతనాట్యంలో యువకళాకారిణిగా తనదైన ముద్రవేసుకున్నారు. సరిగ్గా అప్పుడే చెన్నరులో తెలుగువారి నృత్య కళారూపం ‘కూచిపూడి’లో శిక్షణనిచ్చే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దృష్టిలో పడ్డారు యామిని. ‘తెలుగునాట పుట్టావు. తెలుగువారి కళారూపం కూచిపూడి జ్ఞాపకంగానే చరిత్రపుటల్లో మిగిలే దుస్థితి దాపురిస్తోంది. అంతరించిపోతున్న కళారూపాన్ని కొంతయినా నిలబెడదాం’ అని ఆమెకు చెప్పారు. దీనికి తండ్రి ప్రోత్సాహం కూడా తోడయ్యింది. అప్పటి నుండి వేదాంతం లక్ష్మీనారాయణ ఆమెకు స్వయంగా శిక్షణనిచ్చారు. తొలిసారి కూచిపూడిలో దశావతారం శబ్దం నేర్చుకున్నారు.
కొద్ది కాలంలోనే పట్టుసాధించి
ఆరోజుల్లో కూచిపూడి అంటే నాట్య ప్రపంచానికి చిన్నచూపు. సంగీత నాటక అకాడమీ సైతం కూచిపూడిని సంప్రదాయ నృత్యంగా గుర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో కూచిపూడి నేర్చి ఆ కళారూపంమీద కొద్ది కాలంలోనే పట్టుసాధించారు. ‘కృష్ణశబ్దం’ యామినిలా మరెవరూ సమర్పించలేరని పేరు తెచ్చుకున్నారు. ‘భామాకలాపం’లో సత్యభామ పాత్రలో అద్భుత నటన ప్రదర్శించారు. ‘క్షీరసాగర మథనం’లో మోహినిగా మెప్పించారు. ఆ రూపకంలో నాట్యగురువు వెంపటి చినసత్యం శ్రీకృష్ణుని వేషం వేశారు. సంవాదపూర్వకంగా సాగే అంశం’దశావతారం’లో యామిని నృత్యాభిన యానికి సాక్షాత్తూ నాటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ముగ్ధులై స్వయంగా అభినందించారు. ‘భామవేణి’ అనే జడను ఆమెకు బహూకరించారు.
ప్రవేశం ఓ సంచలనం
కేవలం మగవాళ్లకే పరిమితమైన కూచిపూడి కళారంగంలో యామిని ప్రవేశం ఓ సంచలనం. గురు శిష్యుల సాయంతో ఆమె కూచిపూడి నృత్యానికి కొత్త సొగసులద్దారు. మొట్టమొదటి ఫిమేల్ సూపర్ స్టార్ డ్యాన్సర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. అలాగే ఒడిస్సీ అభినయ పాఠాలు నేర్చి దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఆలయ నాట్యాలు తప్ప అన్ని నృత్యాలలో పురుషులదే పైచేయిగా ఉండే కాలమది. స్త్రీలకు కట్టుబాట్ల కాలంలో సంకెళ్లను ఛేదించి ముందుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమకాలంలో పుట్టిపెరిగిన ఆమె మహాత్మాగాంధీ బోధనలకు ఆకర్షితురాలయ్యారు. ఈ స్ఫూర్తితోనే ‘గాంధీయన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్’ అనే నృత్యరూపకాన్ని చేశారు. భరతనాట్యంలో ఎంతో క్లిష్టమైన తాళ గతులను సంస్కరించారు. ‘నాన్న నుంచి నాకు అలవడిన లక్షణం స్తితప్రజ్ఞత’ అంటారు యామిని.
విశ్వవేదికలపై…
కూచిపూడిని సోలో డ్యాన్స్‌గా తీర్చిదిద్దటంలో యామిని కృషి మరువలేనిది. ఆమెకు కూచిపూడి ప్రాణం, భరతనాట్యం ధ్యానం, ఒడిస్సీ అంటే అభిమానం. దూరదర్శన్‌లో నృత్యరీతులపై 13 భాగాల సీరియల్‌కు రూపకల్పన చేశారు. ఆమె ఆంగ్లంలో ‘ఎ ప్యాషన్ ఫర్ ఎ డ్యాన్స్’ అనే పేరుతో జీవిత చరిత్ర రాశారు. పళ్లెం, కలశంతో డ్యాన్స్ చేసే పద్ధతిని తొలిసారి ఢిల్లీ ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు ఈమె. కాళిదాస, భవభూతి, శంకర పద్యాల ఆధారంగా కొన్ని నృత్యాంశాలను తయారు చేశారు. తొలిసారిగా లండన్ కామన్వెల్త్ కాన్ఫరెన్స్ లో యామిని ప్రదర్శన ఇచ్చారు. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, మెక్సికో, పాకిస్థాన్ దేశాల్లో పర్యటిం చి ప్రదర్శనలిచ్చి కళానీరాజనాలం దుకున్నారు యామిని. భారత రాష్ట్రపతి వివి గిరితో బ్యాంకాక్‌కు బయల్దేరిన భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలు.
పురస్కారాలు
భారతీయ నృత్యరీతుల్లో చేసిన కృషికి గుర్తింపుగా యామినికి అనేక పురస్కారాలు లభించాయి. 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గుర్తించింది. 1977 సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 2001లో పద్మభూషణ్ వరించింది. అ ఏడాది మరోసారి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2002 భారతీయ నృత్యరీతులకు ప్రాచుర్యం కల్పించిన యామిని కృషికి గుర్తింపుగా కళింగ పురస్కారం లభించింది. 2014లో బెంగళూరు శాంభవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ యామినిని నాట్యశాస్త్ర పురస్కారంతో సత్కరించింది. 2016 దేశ అద్వితీయ పురస్కారం, పద్మ అవార్డుల్లో అత్యత్తమమైన పద్మవిభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఆమె కళా వైశిష్ట్యాన్ని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా నియమించింది.