నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్‌రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావుతోపాటు నవీన్‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డితోపాటు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్‌రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని, అందుకు విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు. ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని రీజినల్ పాస్‌పోర్టు అథారిటీకి దర్యాప్తు అధికారి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన డేటాతోపాటు ఎస్‌ఐబీకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్‌లను నిందితులు ధ్వంసం చేసి.. కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. ఎస్‌ఐబీలోని క్యాట్, యూఎఫ్ టీమ్‌ల సమాచారాన్నీ తొలగించారని తెలిపారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లను, 5 యాపిల్ హార్డ్‌డిస్క్‌లను ఆ సంస్థ ప్రతినిధులే వచ్చి తొలగించారన్నారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం కలిగించారని ఆరోపించారు. అఫిడవిట్‌లో దర్యాప్తు అధికారులు పేర్కొన్న వివరాలు..