రికవరీ అయిన 13 లక్షల 43,390 రూపాయలు…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
ప్రజా పాలన నిధులు స్వాహా అని అక్టోబర్ 4వ తేదీన నవతెలంగాణ పత్రికలో మినీకతను ప్రచురితమైంది. ఈ మినీ కథనంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి, ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించిన డబ్బులను ఎంపీడీవో అకౌంట్లో పడేలా చర్యలు తీసుకున్నారు. వివరాలను పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాలలో 421 గ్రామపంచాయతీలలో మొత్తం ప్రజాపాలనలో 2,68 ,678 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఒక్కొక్క దరఖాస్తు ఐదు రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. కేటాయించిన డబ్బులను నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఫిబ్రవరి నెలలోని ఎంపీడివో అకౌంట్లో జమ చేశారు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్టోబర్ వరకు రాలేదు. విషయం నవతెలంగాణకు తెలియడంతో ప్రజాపాలన నిధులు స్వాహా మినీ కథనం ప్రచురించగా, నవతెలంగాణ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శుల మంచి స్పందన లభించింది. నవతెలంగాణ ప్రతికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి రావాల్సిన డబ్బులను డిపిఓ సునంద అక్టోబర్ 21వ తేదీన ఎంపీడీవో అకౌంట్లో జమ చేయడంతో నవతెలంగాణ పత్రిక చేసిన కృషిని అధికారులు రాజకీయ నాయకులు కొనియాడారు.
స్పెషల్ టీం ల డబ్బులు ఎక్కడ….?
డిసెంబర్ 28 వ తేదీ 2023 నుంచి జనవరి 6 , 2024 తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు స్పెషల్ టీంలను మండలానికి రెండు, మండలాలు అయితే మూడు చొప్పున కేటాయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 51 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంకు 20వేల రూపాయలను కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా చూసుకుంటే మొత్తం పది లక్షల పైచిలుకు డబ్బులు రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఈ డబ్బులు టీం హెడ్లకు చెల్లించకపోవడంతో 10 లక్షల రూపాయలు ఏమయ్యాయి అని టీం నాయకులు ప్రశ్నిస్తున్నారు. పై అధికారుల వద్ద డబ్బులు ఉండడంతో వారిని అడగలేక ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ 10 లక్షల రూపాయలను వారికి అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై డిపిఓ సునంద ను వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.