నవతెలంగాణ-హైదరాబాద్ : రాజకీయ కురువృద్ధుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం లేదని ఆయన వెల్లడించారు. రాజ్యసభ ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి కొనసాగాలా లేదా అనేదానిపై ఆలోచిస్తానని ఆయన వెల్లడించారు. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ గడువు సమీపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. లోక్‌సభకు పోటీ చేయను. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోను. ఏ ఎన్నికల్లోనూ మీరు నన్ను ఓడించలేదు. ప్రతి ఎన్నికలోనూ మీరు నన్ను గెలిపించారు. కాబట్టి నేను ఎక్కడో ఒక చోట ఆపాలి. కొత్త తరాన్ని తీసుకురావాలి. అయితే నేను సామాజిక సేవను వదలడం లేదు. నాకు అధికారం అక్కర్లేదు’’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. తన మనవడు యుగేంద్ర పవార్‌కు మద్దతుగా బారామతి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల బహిరంగ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.