ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రాజీనామా చేయాలి

– మణిపూర్‌ ఫైల్స్‌..
– మణిపూర్‌ మహిళా నేరాలపై ఫిర్యాదులొచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదు..?
– ఈ క్రూరమైన దాడిని ఎన్సీడబ్ల్యూ ఉద్దేశపూర్వకంగా విస్మరణ
– పాలక పక్షపాతిగా దిగజారడం దారుణం
– ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖాశర్మకు మహిళా సంఘాల లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ఫిర్యాదులంది నప్పటికీ, జాతీయ మహిళ కమిషన్‌ (ఎన్సీడబ్ల్యూ) చర్యలు తీసుకోకపోవడం పట్ల మహిళా సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు బాధ్యత వహించి ఎన్సీడబ్ల్యూ చైర్‌ పర్సన్‌ పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు శనివారం ఎన్సీడబ్ల్యూ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మకు ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, ఏఐపీడబ్ల్యూయూఏ, ఎఐఎంఎస్‌ఎస్‌, ఎఐఎఎంఎస్‌, ఏఐసీపీపీఐ తదితర మహిళ సంఘాలు సంయుక్తంగా లేఖ రాశాయి.
” మణిపూర్‌లో ముగ్గురు మహిళలను ఒక గుంపు బహిరంగంగా బట్టలు విప్పి లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటనకు సంబంధించి ఎన్సీడబ్ల్యూకి ఫిర్యాదు అందినప్పటికీ, నెలకు పైగా ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై మహిళా సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. మణిపూర్‌లో ఇతర లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నట్టు సమాచారం అందింది. కొద్దిరోజుల క్రితం క్రూరమైన హింసకు సంబంధించిన వీడియో బయటకు వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైనప్పుడు, ఎన్సీడబ్ల్యూ నిద్ర నుంచి మేల్కొని నేరాన్ని ”సుమోటో కాగ్నిజెన్స్‌ కింద తీసుకుంది” అని విమర్శించాయి. ”మే 3న హింస ప్రారంభమైన వెంటనే, మే 4న జరిగిన ఘటనలో కేవలం జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడం మినహా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో బాధితుల పట్ల పోలీసుల ఉదాసీనత, నేరానికి పాల్పడిన వారితో కుమ్మక్కు కావడం స్పష్టంగా కనిపించింది” అని ధ్వజమెత్తాయి. ”రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని మౌనం అత్యంత ఖండించదగినది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మీకు తెలుసు. మణిపూర్‌లో జరుగుతున్న హింసకు ప్రత్యక్ష బాధితులుగా మహిళలు మారారని మీకు తెలియదా?” అని ప్రశ్నించాయి. ” ఎన్సీడబ్ల్యూ తన బాధ్యతకు ద్రోహం చేసిందని, ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నించిందని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాం. దేశంలోని మహిళలను రక్షించడం, వారి హక్కులను కాపాడటం ఎన్సీడబ్ల్యూ బాధ్యత..అలాంటిది తాజా ఘటనతో ఆ సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని విమర్శించాయి.
జాతీయ మహిళా కమిషన్‌ అధికార పార్టీ అస్త్రంగా వ్యవహరించకుండా, దాని ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో దాని స్వయంప్రతిపత్తి, గౌరవాన్ని కాపాడాల్సి ఉంది. ఎన్సీడబ్ల్యూ దాని ఉన్నతమైన లక్ష్యం నుంచి పక్కదారి పట్టకుండా మేం తరచు గొంతెత్తుతాం. మహిళలకు సంబంధించిన అనేక సమస్యలలో చురుకైన జోక్యం చేసుకున్న చరిత్ర ఎన్సీడబ్ల్యూకి ఉంది. కానీ మీ సారథ్యంలో, ఈ సంస్థ డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు జీ హుజూర్‌ అంటోందని మేము చూశాం.
మణిపూర్‌లోని అధికారులకు తెలియజేసినట్లు మీ వాదనలు చాలా ఆలస్యంగా వచ్చాయి. సంస్థ ఇంత అవమానకరంగా దాని స్వంత ఆదేశాన్ని అణగదొక్కడం మేం ఎన్నడూ చూడలేదు. ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన ఈ క్రూరమైన దాడిని ఉద్దేశపూర్వకంగా విస్మరించి, అణచివేయడంలో ఎన్సీడబ్ల్యూ తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసింది. ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా ఈ అవమానకరమైన పరిస్థితికి మేము మిమ్మల్ని బాధ్యులుగా భావిస్తున్నాం. అనర్హులుగా నిరూపించుకున్న మీరు వెంటనే పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్‌ చేశాయి.

Spread the love