నితీశ్‌ను కలిసిన నీట్‌ నిందితుడి భార్య..

నవతెలంగాణ-హైదరాబాద్ :  నీట్‌ పేపర్‌ లీక్‌పై బీహార్‌లో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటున్నారు. నీట్‌ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ సోమవారం ఒక ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. నీట్‌ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి, బీహార్ సీఎం నితీశ్‌ కుమార్ ఎన్డీయే నేతలతో కలిసి ఉన్న ఫొటోను అప్‌లోడ్‌ చేసింది. కాగా, ఎన్డీయే నేతలతో సంజీవ్ ముఖియాకు సంబంధాలు ఉన్నాయని ఆర్జేడీ ఆరోపించింది. ‘నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను ఎవరు కాపాడుతున్నారు? ఎన్డీయేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి జేడీ(యూ) నాయకురాలన్నది నిజం కాదా?సీఎంవోలోని ఒక శక్తివంతమైన అధికారితో సంజీవ్ ముఖియాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నది నిజం కాదా? అగ్ర నాయకత్వం ప్రత్యక్ష జోక్యం కారణంగా, ఈ కుటుంబం స్వేచ్ఛగా తిరుగుతున్నది నిజం కాదా?’ అని ప్రశ్నించింది.

Spread the love