– మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ -కంటేశ్వర్
దొంగ కోట్ల ఏరివేతలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మాజీ మత్రి సుదర్శన్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ భవన్లో జిల్లాలో జరుగుతున్న దొంగ ఓట్ల నమోదుపై మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తూ దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం తీసుకువచ్చారని, ఆ తర్వాత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి ప్రజలే నాయకుడిని ఎన్నుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేసిందని, కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దొరలాగా పరిపాలన చేస్తూ తమ తప్పులు ప్రజలు గుర్తించి ఎక్కడ ఓట్లు వెయ్యరో అని దొంగ ఓట్లను సృష్టించే కార్యక్రమం చేస్తున్నారని ఆయన అన్నారు. జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీ నాయకులు, అధికారులు అధికార దుర్వినియోగంతో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఓటు హక్కు అనేది ఎంతో విలువైనదని ఒక మనిషి తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును కల్పిస్తుందని, దానిని కాలరాసే విధంగా అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను సృష్టించి అధికారంలోకి రావాలనే కుట్రను చేస్తున్నారని ఆయన అన్నారు. ఉదాహరణకు బోధన్ నియోజకవర్గంలోని శక్కర్ నగర్ కు సంబంధించిన 87వ బూత్ లో ఇప్పటివరకు 800 ఓటర్లు ఉంటే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ లో 782 కొత్త అప్లికేషన్లు వచ్చాయని, కానీ వ్యక్తిగతంగా అధికారులకు మాత్రం ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని, కేవలం ఆన్లైన్లోనే 782 కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేసుకున్నారో అధికారులు చెప్పాలని, అదేవిధంగా వారు కొత్తగా షక్కర్ నగర్ కు వచ్చి ఎక్కడ ఉంటున్నారో అధికారులు తెలుసుకోవాలని, దాదాపు ఆరు నెలల నుండి ఒక బూత్ ఉంటే వారికి మాత్రమే ఆ బూత్ లో ఓటు హక్కు ఇవ్వాలి, కానీ ఎన్నికల నేపథ్యంలో 782 మంది కొత్తవారు 87వ బూత్ లో ఎక్కడ నుంచి వచ్చి ఉన్నారని, అంతమంది ఉండడానికి అక్కడ ఎన్ని ఇల్లులు పెరిగాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు తెలపాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. అదే విధంగా 88వ బూత్ లో 538, 95వ బూత్ లో 509, 96వ బూత్ లో 539, 97వ బూత్ లో 344, 99వ బూత్ లో 510, 100 బూత్ లో 119 కొత్త అప్లికేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయో అధికారులు సమీక్ష చేయాలని, ఒకవేళ నకిలీ ఆధారాలతో ఎవరైనా కొత్త ఓట్లను సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఒకవేళ దీని వెనుక అధికారుల హస్తం ఉంటే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అధికార పార్టీ నాయకులు గానీ, అవినీతి చేయాలని చూస్తున్న అధికారులు కానీ గుర్తుంచుకోవాలని అందరిపై చర్యలు తీసుకుంటామని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి ,పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, పిసిసి మెంబర్ ఈసా, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ ,నగర ఎస్సి అధ్యక్షులు వినయ్, రాజేందర్, కిషన్, నూరుద్దిన్, మధు మరియు తదితరులు పాల్గొన్నారు