– కొనసాగుతున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె
– విధుల్లో చేరిన మూడు విభాగాల కార్మికులు
– సమ్మెకు బీజేపీ సంఘీభావం
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ మున్సిపల్ కార్మికులు, సిబ్బంది చేపడుతున్న సమ్మె చర్చలు మంగళవారం అర్దాంతరంగా ముగిశాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అంజయ్య, మాజీ మున్సిపల్ కమిషనర్ దస్తగిరి, పలువురు కౌన్సిలర్లు కార్మికులతో పాటు సిబ్బందితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. తమకు మూడు నెలల వేతనాలు చెల్లిస్తూ, రూ. 60 లక్షల పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు మంగళవారం ఒక మెట్టు దిగి రూ. 30 లక్షల పీఎఫ్ ఖాతాలో జమ చేయడంతో పాటు తమకు మూడు నెలల వేతనాలకు అంగీకరించారు. కాని ఇందుకు కూడా కమిషనర్ అంగీకరించలేదు. పీఎఫ్ రూ. 30 లక్షలు ఖాతాలో జమ చేయాల్సిందేనని, కనీసం రెండు నెలల వేతనాలైనా తమకు చెల్లించాలని కార్మికులు కోరగా, ఇందుకు కూడా వారు అంగీకారం తెలుపకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. దీనితో 80 మంది కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులు యదాతథంగా సమ్మె కొనసాగిస్తున్నారు. మంగళవారం నాటికి వీరి సమ్మె 20వ రోజుకు చేరుకుంది.
విధుల్లో చేరిన మూడు విభాగాల కార్మికులు
కాగా రూ. 30 లక్షల పీఎఫ్, ఒక నెల వేతనానికి అధికారులు, కౌన్సిలర్లు ముందుకు రాగా దీనికి ఎలక్ట్రిసిటీ, మంచినీటి సరఫరా, కార్యాలయం సిబ్బంది అంగీకారం తెలుపడంతో వారు అప్పటికప్పుడే విధుల్లో చేరారు. మంచినీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ విభాగాలు కలిపి సుమారు 35 మంది, కార్యాలయ సిబ్బంది 20 మంది వరకు ఉండగా, అటో ట్రాలీలు నడిపేవారు 13 మంది ఉన్నారు. వీరంతా సమ్మె విరమించి విధుల్లో చేరారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు
కాగజ్‌నగర్ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు భారతీయ జనతా పార్టీ మంగళవారం మద్దతు తెలిపింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు చేపడుతున్న సమ్మె శిబిరం వద్దకు వెళ్లి బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల వేతనాల నుండి కోత విధించిన మొత్తాన్ని ఈఎస్‌ఐ, పీఎఫ్ ఖాతాలో జమ చేయకపోవడం ఎవరి తప్పిదమని వారు ప్రశ్నించారు. ఆర్థిక భారమని చెపుతున్న అధికారులు, కౌన్సిల్ సభ్యులు కొత్తగా కార్మికులను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క స్పందించి వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్ష్లంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొంగ సత్యనారాయణ, చిత్తవేణి రాజేష్ యాదవ్, బండి శ్రీనివాస్, జాడి అశోక్ కుమార్ పాల్గొన్నారు.