చర్చలు మళ్లీ వాయిదా

Negotiations adjourned again– రామోజీ యాజమాన్యం గైర్హాజరు
– చర్చించకుండానే వెళ్లిపోయిన ఆర్డీవో
– పరిమిత నాయకత్వంతో చర్చిస్తామని వెల్లడి
– ఇరు వర్గాల మధ్య చర్చలు నేటికి వాయిదా
– కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రామోజీరావు యాజమాన్యం, ఇండ్ల స్థలాల లబ్దిదారుల పక్షాన సీపీఐ(ఎం) నాయకులకు మధ్య జరగాల్సిన చర్చలు బుధవారం మళ్లీ వాయిదా పడ్డాయి. ఎలాంటి చర్చలు జరపకుండానే ఆర్డీవో తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యానికి అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చినా గైర్హాజరయ్యారు. దాంతో ఇరువర్గాల మధ్య జరగాల్సిన చర్చలు గురువారానికి వాయిదా పడ్డాయి. 2007లో తమకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు వెళ్లకుండా అడ్డుపడుతున్న రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల లబ్దిదారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దఫా దఫాలుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు ధర్నా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరిపారు.
ఇండ్ల స్థలాల విషయంలో రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యానికి, పేదలకు మధ్య అధికారుల సమక్షంలో గతంలో జరిగిన ఒప్పందం మేరకు అమలు చేస్తారా? లేదా తమకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లోకి వెళ్లి గుడిసెలు వేసుకోవాలా? అనేది తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అయితే రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యం, సీపీఐ(ఎం) నాయకత్వంలో పేదలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డిని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం మరోసారి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అయితే సోమవారం ఇరువర్గాలను పిలిపించి చర్చలు జరుపుతామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో రెండ్రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. కాగా బుధవారం ఇరు వర్గాలను పిలిపించి చర్చలు జరుపుతామని చెప్పిన తరుణంలో సీపీఐ(ఎం) నాయకులు, వందలాది మంది పేదలు ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి ఉదయమే చేరుకున్నారు.
కానీ రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యం మాత్రం గైర్హాజరైంది. సీపీఐ(ఎం) నాయకులు, ఆర్డీవోతో చర్చలు జరిపారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యం అందుబాటులోకి రాలేదని వారికి సమాచారం ఇచ్చి గురువారం చర్చలు నిర్వహించేందుకు చొరవ చూపుతానని నాయకులకు ఆర్డీవో చెప్పి అత్యవసర పనిమీద బయటకు వెళ్లిపోయారు.

Spread the love