మంత్రితో చర్చలు విఫలం

– గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె యథాతధం
– 27న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో 17 రోజులుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేయాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. దానిలో భాగంగా ఈనెల 27న కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్‌, జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి ఎం యజ్ఞనారాయణ్‌, కన్వీనర్లు బీ వెంకటరాజం, పీ అరుణ్‌కుమార్‌, పీ శివబాబు, డీ దాసు తదితరులు మంత్రి వద్దకు చర్చలకు వెళ్లారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ…పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విదేశీ పర్యటనలో ఉన్నారనీ, ఆయన తిరిగి వచ్చాక చర్చించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరాలని కోరారు. మంత్రి సమాధానంపై జేఏసీ నేతలు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో భేటీ అయ్యి చర్చించారు. పాలకవర్గాలు గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో హామీలు ఇచ్చి, సమ్మెలు, ఆందోళనలు విరమింపచేసి, ఆ తర్వాత సమస్యలు పరిష్కరించకుండా మిన్నకుండిన సందర్భాలను నాయకులు ప్రస్తావించారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయడం, వేతనాల పెంపు, కార్మికులకు బీమా, మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు, కారోబార్‌, బిల్‌ కలెక్టర్ల పదోన్నతులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మెను యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆందోళనలు ఉధృతం చేయడంలో భాగంగా ఈనెల 27న కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే ప్రతిఘటించాలనీ, పోటీ కార్మికులను పెడితే అడ్డుకోవాలనీ జేఏసీ సమావేశం నిర్ణయించింది. మంత్రితో చర్చల అనంతరం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. కష్టించి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నామనీ, దానికీ సిద్ధంగా లేకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో జేఏసీ కోశాధికారి సీహెచ్‌ సదానందం (టీజీకేబీయూ) కన్వీనర్‌ సీహెచ్‌ వెంకటయ్య (సీఐటీయూ), కో కన్వీనర్లు పాలడుగు సుధాకర్‌ (సీఐటీయూ), జయచంద్ర (ఏఐటీయూసీ), జటంకి వెంకన్న (ఐఎఫ్‌టీయూ), టీ నర్సింహారెడ్డి (ఏఐటీయూసీ), సాదుల శ్రీకాంత్‌ (టీజీకేబీయూ) తదితరులు పాల్గొన్నారు.

Spread the love