సీఎం పదవికి రాజీనామా చేస్తా..త్వరలో కొత్త సీఎం : కేజ్రీవాల్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ఆప్‌ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్‌ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామన్నారు. ఆప్‌ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని.. త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆప్‌ నుంచి మరొకరు సీఎం అవుతారని, కొత్త సీఎం ఎంపిక కోసం రెండు, మూడ్రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ‘‘ఆప్‌లో చీలికలు తెచ్చి దిల్లీలో అధికారంలోకి రావాలని భాజపా కుట్ర పన్నింది. మా పార్టీని ముక్కలు చేసేందుకే నన్ను జైలుకు పంపారు. కానీ ఎన్ని ఎత్తులు వేసినా పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయింది. నన్ను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదు. జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీం కోర్టే ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని నడపవచ్చని వెల్లడించింది’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

Spread the love