జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమలు

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రిటిష్‌ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నేర చట్టాలు ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CrPC), భారత సాక్ష్యాధార చట్టం-1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య (BS) చట్టాలను వర్తింపజేయనున్నారు. గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబరు 25న రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చాయి. నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా పార్లమెంట్‌లో తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో పాటు రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చామని వివరించారు. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్‌ ఉండగా.. కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్‌గా పెట్టారు. కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్‌ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 136 కింద చేర్చారు.

Spread the love