– 20 మంది విద్యార్థులకే ప్రవేశం
– ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం : జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో కొత్తగా మాస్టర్స్ కోర్సును ప్రారంభిస్తున్నట్టు ఆ వర్సిటీ ఉపకులపతి ఎన్ కవితా దర్యాణిరావు చెప్పారు. ఎంటెక్ (శక్తి (ఎనర్జీ) స్థిరమైన నిర్మిత పర్యావరణం) కోర్సుకు సంబంధించి వచ్చేనెల లేదా అక్టోబరులో తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఆ కోర్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని చెప్పారు. ఈ కోర్సును ప్రవేశపెట్టడం నేటి అవసరమని అన్నారు. ఇది పరిశ్రమ, సబ్జెక్ట్ నిపుణుల సహకారంతో అందించబడుతుందన్నారు. ఇందులో 20 మంది విద్యార్థులకే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. బీటెక్, బీ డిజైన్, బీఆర్క్ పూర్తి చేసిన విద్యార్థులే అర్హులని చెప్పారు. అభ్యర్థులు పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీసెట్) అర్హత కలిగి ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు షషష.jఅaటaబ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేయాలని కోరారు. శక్తి, నిర్మిత పర్యావరణం, స్థిరమైన అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని విద్యార్థులకు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీనివాస్, టెర్రా విరిదీస్ సస్టెయినబులిటీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ స్వాతి పుచ్చలపల్లి, ముంబయి సస్టెయినబులిటీ సర్వీసెస్ అసోసియేట్ జీవన్ మోహన్, ఐజీబీసీ ప్రిన్సిపల్ కౌన్సిలర్ ప్రవీణ్ సోమ, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఫౌండేషన్ ఇండియా ఫౌండర్ శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.