సీఎం రేవంత్ రెడ్డి టీంలోకి కొత్త మంత్రులు..!

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ ఢిల్లీలో రెండు రోజుల్లో పార్టీ హైకమాండ్ తో భేటీ కానున్నారు. ఆ సమయంలోనే నూతన పీసీసీ చీఫ్.. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు.
మంత్రివర్గ విస్తరణ రేవంత్ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే, తాజా విస్తణలో ఒకేసారి ఆరు పదవులు భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మంత్రి పదవుల రేసులో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ నుంచి సుదర్శన్రెడ్డి, అదిలాబాద్ నుంచి ప్రేమాసాగర్రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ మంత్రిపదవులకు పోటీ పడుతున్నారు.
ప్రాంతీయ -సామాజిక సమీకరణాల్లో భాగంగా సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్ను ఎంపిక చేస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు బాలూనాయక్ కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. ఆదిలాబాద్లో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్రావు, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ పోటీలో ఉన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇస్తారని చెబుతున్నారు.
బీసీ కమిషన్ చైర్మన్ పోస్టును మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కీలకంగా మారింది. ఈ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు వి. హన్మంతరావు, గోపిశెట్టి నిరంజన్ లో ఒకరికి ఛాన్స్ ఉంది. రైతు, విద్యా కమిషన్ చైర్మన్లుగా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ అకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు సమాచారం.

Spread the love