– యూపీఐ ద్వారా చెల్లించేలా కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రేటర్‌లో కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుందని సమాచారం. ఇప్పుడున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్‌ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జల మండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధి లోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్‌మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను వసూ లు చేస్తున్నారు. ఆస్తి పన్ను ఆరు నెలల కోసారీ, నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తున్నారు. ఇం టింటికీ తిరిగి చెత్త సేకరించేం దుకు కొన్ని ప్రాంతాల్లో నామ మాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులు బాటు ఉండేలా కొత్త విధానం తేనున్నారు. డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకారం జారీ చేస్తాయి. యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రతి నెలా చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది. దీంతో విని యోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తు న్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను. నల్లా బిల్లుతో పాటు చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసేలా కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఒకే సారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని భావిస్తున్నారు. అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ఫ్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలనే సీఎం సూచన మేరకు అధికారులు ప్రణాళిక రూపొం దిస్తున్నారు. విద్యుత్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుముతో పాటు కనెక్షన్ కట్ చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కొత్తగా జీహెచ్‌ఎంసీ, జల మండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు నిర్ణీత గడువు ఉండాలనీ, గడువు దాటితే ఒకదానికొకటి లింకు ఉండేలా చర్యలపై కసరత్తు చేయనున్నారు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికీ ఆర్ధిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వడంతో పాటు కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో కాకుండా నేరుగా కార్పొరేషన్ల ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.