నవతెలంగాణ – హైదరాబాద్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించిన ఫాస్టాగ్‌లను ఉపయోగిస్తున్నవారికి ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక సూచన చేసింది. మార్చి 15 లోగా కొత్త ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని బుధవారం కోరింది. ఆర్బీఐ కఠిన ఆంక్షల నేపథ్యంలో మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో లింక్ అయి ఉన్న ఫాస్టాగ్‌లపై టాప్-అప్ లేదా రీఛార్జులు సాధ్యపడవని స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణ సమయంలో జరిమానాలు, రెట్టింపు ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు నూతన ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయడం ఉత్తమమని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పేటీఎం ఫాస్టాగ్‌లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత బ్యాంకులను వినియోగదారులు సంప్రదించవచ్చునని సూచించింది. హెచ్ఎంసీఎల్ అధికారిక వెబ్సైట్లో కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చునని పేర్కొంది.