ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

నవతెలంగాణ – అల్లూరి సీతారామరాజు: గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామంలో సుమారు 60 మంది విద్యార్థులున్నా పాఠశాల లేదంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాదాపు 6 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటి నడుచుకుంటూ విద్యార్థులు స్కూలుకు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నాయి. విద్యార్థుల బాధలు చూడలేక ఓ ఎన్జీవో సంస్థ తాత్కాలిక స్కూల్‌ను ఏర్పాటు చేసిందని వెల్లడించాయి. దీన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఎన్జీవో స్కూల్ ఏర్పాటు చేసినా టీచర్‌ను ఎందుకు కేటాయించలేదని నోటీసుల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గిరిజన గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.

Spread the love