తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 30 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు

నవతెలంగాణ -న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం దాడులు నిర్వహిస్తోంది. ఐఎస్‌ఐఎస్‌ రాడికలైజేషన్‌ మరియు రిక్రూట్‌మెంట్‌ కేసులో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 30 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు నిర్వహిస్తోంది. కోయంబత్తూర్‌లోని 21, చెన్నైలో మూడు, తెన్‌కాశీలో ఎన్‌ఐఎ దాడులు నిర్వహిస్తోంది. అలాగే హైదరాబాద్‌లోని ఐదు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఎ ఏజెన్సీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. కాగా, 2022వ సంవత్సరంలో కోయంబత్తూర్‌ ఐఎస్‌ఎస్‌ ఉగ్రవాద సంస్థ కారు బాంబు పేలుడుకి పాల్పడింది. ఈ బాంబు దాడిలో ప్రమేయం ఉన్న 13వ వ్యక్తి మొహమ్మద్‌ అజారుద్దీన్‌ అలియాన్‌ అజీర్‌ని ఈ నెలలో ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. ఈ ఘటనపై ఎన్‌ఐఎ అక్టోబర్‌ 2022లో కేసు నమోదు చేసింది. కోయంబత్తూర్‌లోని ఉక్కడంలోని ఈశ్వరన్‌ కోవిల్‌ స్ట్రీట్‌లోని అరుల్మిగు కొట్టై సంగమేశ్వరర్‌ తిరుకోవిల్‌ అనే పురాతన ఆలయం ముందు గతేడాది అక్టోబర్‌ 23న కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో డ్రైవర్‌ జమేషా ముబీన్‌ మృతి చెందాడు. ముబిన్‌, అతని సహచరులు ఐఎస్‌ఎస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎన్‌ఐఎ దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై చెన్నైలోని పూనమల్లిలోని ఎన్‌ఐఎ కోర్టులో ఎన్‌ఐఎ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో ఎన్‌ఐఎ రెండు ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఆరుగురిపై, జూన్‌ 2న ఐదుగురిపై ఎన్‌ఐఎ ఛార్జిషీటు దాఖలు చేసింది. 12వ నిందితుడైన మహ్మద్‌ ఇద్రిస్‌ను ఈ ఏడాది ఆగస్టు 2న ఎన్‌ఐఎ అరెస్టు చేసింది.

Spread the love