44 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు…

NIAనవతెలంగాణ – ఢిల్లీ: ఐసిస్‌ కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తోన్న ఈ దాడుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసింది. ఐసిస్‌ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఎస్‌ఐఏ ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు కర్ణాటకలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. పుణెలో రెండు చోట్ల, ఠాణెలో 40 చోట్ల , కర్ణాటకలో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. పుణె ఐసిస్‌ మాడ్యుల్‌ కేసులో కీలక నిందితుడైన షానవాజ్‌ను దిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసుతో సంబంధమున్న వారందరిని పట్టుకునేందుకు ఎన్‌ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. పుణె మాడ్యూల్‌ కేసుతో సంబంధమున్న మరో ఏడుగురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసి గత నెలలో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితులు ఉగ్ర ముఠాలను ఏర్పాటు చేసి.. నిధులను సేకరిస్తున్నారని పేర్కొంది. వారి నుంచి మారణాయుధాలు, ఐఈడీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Spread the love