నిఖత్‌ డబుల్‌ ధమాకా

నవతెలంగాణ-హైదరాబాద్ : బాక్సింగ్‌ క్వీన్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొడుతోంది. నిఖత్‌ తన విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి డబుల్‌ ధమాకా సృష్టించింది. సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసుకోవడంతో పాటు వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్త్‌ కూడా దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల 50 కిలోల విభాగం క్వార్టర్‌ఫైనల్లో జోర్డాన్‌ బాక్సర్‌ నాసర్‌ హనన్‌పై నిఖత్‌ విజయం సాధించింది. బౌట్‌ ఆరంభం నుంచే దీటుగా చెలరేగిన నిఖత్‌ పంచ్‌లకు హనన్‌ ఏమాత్రం బదులివ్వలేకపోయింది. దీంతో రెఫరీ మధ్యలోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. ఆదివారం జరిగే సెమీఫైనల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత చుతామత్‌ రక్సాత్‌ (థాయ్‌లాండ్‌)తో నిఖత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో భారత బాక్సర్‌ పర్వీన్‌ (57 కిలోలు) 5-0తో స్థానిక ఫేవరెట్‌ జిచున్‌ గ్జూను చిత్తుచేసి క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. పురుషుల విభాగంలో లక్ష్య చాహర్‌ (80 కి) 1-4తో కిర్గిస్థాన్‌ బాక్సర్‌ ఒముర్బెక్‌ బెకిగిట్‌ చేతిలో ఓటమిపాలై మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు

Spread the love