తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌

– రెండోసారి బంగారు పతకం రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
న్యూఢిల్లీలోని కేడి జాదవ్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోటీల్లో 50 కిలోల విభాగంలో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాంకు చెందిన బాక్సర్‌ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘనవిజయం సాధించి భారత్‌కు మరోసారి స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌ తెలంగాణ గర్వించదగ్డ బిడ్డ అని పేర్కొన్నారు. వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ఆమె ప్రపంచాని కి చాటి చెప్పారని తెలిపారు. ప్రపంచ చాంపియ న్‌షిప్‌ పోటీల్లో ఆమె కెరీర్‌లో ఇది రెండో బంగారు పతకం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ దిశగా కృషిని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం పేర్కొన్నారు.
నిఖత్‌ జరీన్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందనలు
మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్న నిఖత్‌ జరీన్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చిరస్థాయిలో నిలిచిపోయేలా ఆమె ప్రతిభను కనబరుస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని ఆకాంక్షించారు.

Spread the love