నీళ్ల పులుసు, పప్పుచారు అక్షయ పాత్ర ఆధీనంలో మధ్యాహ్న భోజనం

– రంగారెడ్డి జిల్లాలో 190 బడులు అప్పగింత
– విద్యుత్‌ మిషన్లతో భోజనం తయారీ చేస్తున్న సంస్థ
– అన్నం తినలేకపోతున్నామని విద్యార్థుల ఆవేదన
– విద్యార్థులకు పోషకాలు దూరం. గుడ్డు కూడా పెట్టని పరిస్థితి
– మధ్యాహ్న భోజన కార్మికులకే అప్పగించాలని డిమాండ్‌
‘సద్ది బువ్వ.. మెత్తబడ్డ బువ్వలో నీళ్ల చారు.. ఇది తినేదెట్లా.. పొద్దున్నే బడికొచ్చే మాకు మధ్యాహ్నం గీ బువ్వ పెడితే మా కడుపెట్టా నిండేది.. ఇంతకు ముందు మధ్నాహ్న భోజన కార్మికులు మా స్కూల్లోనే వండేది.. ఉడుకుడుకు బువ్వ పెట్టేది. ఆ బువ్వ మంచిగుండే.. గిప్పుడేమో గా అక్షయపాత్రకు అప్పగించిండ్రు.. గాళ్లుపొద్దుగాళ్ల ఎక్కడో వండిన దాన్ని మా స్కూళ్లకు తెచ్చి మధ్యాహ్నం పెడుతుండ్రు.. వారంలో రెండు, మూడు సార్లు పెట్టే గుడ్డు కూడా పెడుతలేరు.. గీ బువ్వ మాకొద్దు.. ఇంతకుముందు పెట్టిన బువ్వే మాకు కావాలి’ అని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడం పట్ల వ్యతిరేకత, విద్యార్థుల అవస్థలపై కథనం.
పౌష్టికాహారం కరువు
అక్షయ పాత్ర సంస్థ విద్యార్థులకు అందించే భోజనంలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, గుడ్డు లాంటివి ఏమీ ఉండక పోవడంతో పిల్లలకు పౌష్టి కాహారం అందడం లేదు. వారంలో మూడు రోజులు
గుడ్డు పెట్టాలని మెనూలో ఉంది. కానీ అక్షయ పాత్ర మాత్రం కేవలం వెజ్‌ భోజనం మాత్రమే సప్లరు చేస్తోంది. దాంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మధ్యాహ్న భోజనాన్ని గతంలో లాగే మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పగిం చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,370 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రంగారెడ్డిలో 1,338 ప్రభుత్వ పాఠశాల్లో 1.60 లక్షల మంది, వికారాబాద్‌ జిల్లాలో 1032 ప్రభుత్వ పాఠశాలల్లో 90 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద, మధ్యతరగతి పిల్లలకు పౌష్టి కాహరం అందించేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం 2003లో న్యూట్రీషన్‌ సపోర్ట్‌ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీన్ని 2008లో ప్రైమరీ నుంచి హైస్కూల్‌ వరకు విస్తరించారు. ప్రస్తు తం దీని అమలుపై నీలినీడలు అలుముకుం టున్నాయి. బాధ్య తల నుంచి తప్పుకునేందుకు ప్రభు త్వాలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో స్వచ్ఛంద సంస్థలకు అప్పగిం చింది. ఇదే పద్ధతిలో తెలంగాణలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర అనే స్వచ్ఛం ద సంస్థకు అప్పగించే క్రమం లో అధికారులు రంగారెడ్డి జిల్లాలో ప్రతి స్కూళ్లలో ప్రయోగిస్తారు.
190 స్కూల్స్‌ అక్షయ పాత్రకు అప్పగింత
రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్‌, శంకర్‌పల్లి, రాజేందర్‌నగర్‌, శేరిలింగంపల్లి మొత్తం నాలుగు మండలాల్లో 190 ప్రభుత్వ పాఠశాలను అక్షయ పాత్రకు అప్పగిస్తూ ప్రభుత్వం అర్డర్‌ పాస్‌ చేసింది. 42,454 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యత అప్పగించింది. ఈ యేడు పాఠశాల ప్రారంభం నుంచి అక్షయ పాత్ర విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సప్లరు చేస్తోంది. అయితే అక్షయ పాత్ర సంస్థకు ఒకే ప్రాంతంలో భోజన తయారీ కేంద్రం ఉంది. ఇక్కడి నుంచే జిల్లా నలుమూలకు సప్లరు చేస్తోంది. భోజనం ఉదయం 4 గంటల నుంచి చేస్తున్నారు. ఇది కూడా మిషన్లతో తయారీ చేయడంతో సుమారు నాలుగు, ఐదు గంటలకు కంటే ఎక్కువగా ఉండదు. కానీ 4 గంటలకు వండిన భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టే సరికి అన్నం మెత్త బడుతోంది. దాంతో విద్యార్థులు అన్నం తినలేకపోతున్నారు.
పౌష్టికాహారం అందించాలి
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి. అప్పుడే వండిన వేడి వేడి అన్నం అందించి పిల్ల్లల అరోగ్యాన్ని కాపాడాలి. నాణ్యమైన భోజనం అందించాలి. అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థకు కాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకే నిర్వహణ అప్పగించాలి.
– గోపీ నాయక్‌, యూటీఎఫ్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
అన్నం మెత్తబడుతుంది
మధ్యాహ్న జోనం మా స్కూల్‌కు 10 గంటలకు వస్తోంది. మాకు మధ్యాహ్నం ఒంటి గంటకు పెడతారు. అన్నం మెత్తబడుతుంది. తినబుద్ది కావడం లేదు. సద్దన్నం తిన్నట్టే ఉంటుంది. మేం ఇంటి నుంచి బాక్స్‌ తెచ్చుకుంటున్నాం.
– సైమొద్దిన్‌, 8వ తరగతి విద్యార్థి శివరాంపల్లి హైస్కూల్‌
గుడ్డు పెట్టడం లేదు
అక్షయ పాత్ర భోజనం పెడుతున్నప్పటి నుంచి గుడ్డు పెట్టడం లేదు. గతంలో మధ్యాహ్న భోజన కార్మికులు భోజనం పెట్టినప్పుడు వారంలో రెండు, మూడుసార్లు గుడ్డు పెట్టేవారు. కూరగాయలు కూడా వారంలో ఒకటి, రెండు రోజులు పెడుతున్నారు. రోజూ పప్పు, సాంబార్‌తో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. గతంలో లాగే భోజనం పెట్టాలి.
– శ్రీకాంత్‌, 7వ తరగతి విద్యార్థి శివరాంపల్లి హైస్కూల్‌

Spread the love