– కిడ్నీ అవసరమైన వారి నుంచి రూ.60 లక్షలు వసూలు
– బాధితునికి రూ.5లక్షలు
– బ్రోకర్లు, డాక్టర్లు, ఆస్పత్రి యజమానులకు వాటాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదోళ్ల అవసరంతో పెద్దోళ్లు దందాను కొనసాగించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని టార్గెట్ చేశారు. కిడ్నీ కావాల్సిన వారి నుంచి రూ.50లక్షల నుంచి రూ.60లక్షలు వసూలు చేసి, కిడ్నీ డోనర్స్‌కు మాత్రం రూ.4 నుంచి 5 లక్షలు ముట్టజెప్పేవారు. అలకానంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడిలపై సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. దర్యాప్తు అనంతరం 15 మంది ముఠాలోని 9 మందిని అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుదీర్ బాబు వివరాలు వెల్లడించారు.
సరూర్‌నగర్‌లోని అలకానంద ఆస్పత్రికి సుమంత్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. 2022 నుంచి హైదరాబాద్‌లో జననీ ఆస్పత్రిని నిర్వహించారు. అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసేసి.. ఆరు నెలలుగా అలకానంద ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. జననీ ఆస్పత్రిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సుమంత్‌ను లక్ష్మణ్ అనే బ్రోకర్ కలిశాడు. ఆస్పత్రి మూసేయొద్దని చెప్పిన లక్ష్మణ్.. కిడ్నీ దందాను వివరించాడు. సుమంత్ అంగీకారంతో అవినాష్ అనే డాక్టర్, పవన్ అనే మరో బ్రోకర్‌తో చేతులు కలిపి కిడ్నీ మార్పిడి దందాకు తెరలేపారు. ఈ దందాలో సుమంత్, అవినాష్, పవన్ కింగ్‌పిన్‌గా వ్యవహరించారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి పవన్ కిడ్నీ అవసరమైన వారిని, డోనర్స్‌ను తీసుకొచ్చేవాడు. ఆస్పత్రిలో చేర్పించి, డాక్టర్ అవినాష్, మరికొంత మంది డాక్టర్స్‌తో కలిసి కిడ్నీ మార్పిడీ చేసేవారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలు వసూలు చేశారు. డోనర్స్‌కు రూ.5లక్షలు చెల్లించి, మిగతా డబ్బులు వాటాలుగా పంచుకునే వారు. తమిళనాడుకు చెందిన నసింభాను, ఫిర్ధోస్ కిడ్నీ డోనర్స్. అలాగే బెంగళూరుకు చెందిన రాజశేఖర్, ఫ్రభ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిగా పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా శస్త్ర చకిత్సలు జరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 20 ఆపరేషన్స్ ఆస్పత్రిలో చేశారు. అవినాష్ చైనాలో, సుమంత్ ఉబ్జెకిస్థాన్‌లో ఎంబీబీఎస్ చేశారు. వారిద్దరితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను ప్రశ్నించగా.. ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల గురించి ఆరా తీశారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వ్యక్తులకు ఇందులో సంబంధం ఉందని పూర్తి విచారణ తర్వాత పూర్తి వివరాలు వెలుగు చూస్తాయని సీపీ వివరించారు. మరో ఇద్దరు డాక్టర్స్ రాజశేఖర్, షోహిబ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్లు, బ్రోకర్లు పవన్, పుర్నా, లక్ష్మణ్‌తోపాటు మరికొంత మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు ప్రవీణ్‌కుమార్, కె.మురళీధర్, అదనపు డీసీపీలు బి.కోటేశ్వర్‌రావు, ఎండీ షేక్ హుస్సేయిన్, ఏసీపీ ఏ.క్రిష్ణయ్య, ఇన్‌స్పెక్టర్ వి.సైదారెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.