నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818

దీర్ఘ కవితల్లో కవిత్వం రాను రాను తేలిపోతుంది… లేదా వస్తువు డామినేట్‌ చేస్తుంది కానీ ఈ పుస్తకంలో మాత్రం లోనికి పోనుపోను కవిత్వ ధార చిక్కబడింది. వస్తువు బట్వాడాను బలోపేతం చేసింది.. కొన్ని అంశాలను ముట్టుకునేందుకు సాహితీకారులు భయపడుతున్న దశను మనం చూస్తున్నాం. కానీ ఈ కవి ఆ పరిస్థితుల్ని సవాల్‌ చేస్తూ రాజ్యం నిషిద్ధం చేసిన ఈ వస్తువును భుజానికెత్తుకున్నడు… అంతేనా పిడికిలి బిగించి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాడు.. మనల్నీ ఔర్‌ జోర్‌ సే బోలో అని పిలుపు నిస్తున్నాడు… వరవరరావును, సాయిబాబాను విడిచిపెట్టండి… 75 ఏండ్ల స్వతంత్రదేశం పదానికి అర్థం కల్పించండి.. అని..ఈ కవి దీర్ఘకవిత కోసం ఎంచుకున్న వస్తువు అత్యవసరంగా చర్చించాల్సిన అనేక సామాజిక అంశాల సమ్మిళితం.. అయితే ఆ భావాలా బట్వాడాలో కవిత్వాన్ని రొమాంటిసైజ్‌ చేయటం ఆశ్చర్య పరిచింది.. విప్లవ కవిత్వానికి భావ సౌందర్యం సరిగ్గా అమరింది.. భీమా కోరేగావ్‌ ఒక అమానుష అమానవీయ ఘటనకు సాక్ష్యం.. గాయపడిన గొంతు నుంచి ఈ కవిత్వం పెల్లుబికింది.. న్యాయ వ్యవస్థలో అన్యాయం గురించి అండర్‌ ట్రయల్‌ ఖైదీల దయనీయ స్థితిగతుల నుంచి పుట్టిన సజీవ భావ ప్రవహం భీమానదిలా ప్రవహించింది.. ప్రముఖ చిత్రకారుడు పీవీ చారి చిత్రాలు ఈ కవిత్వ సాంద్రతను బొమ్మకట్టి చూపాయి.. చారి బొమ్మల వల్ల ఈ కవిత్వం మరింత ఫోకస్‌ సంతరించుకుంది..
”కొన్ని తేదీలు కాలాన్ని దుఖానికి బిగిస్తారు… గోడ కొక్కేలకి కాదు”… ”కొన్ని తేదీలు క్యాలెండర్‌లో పేజీలు తిప్పనివ్వవు”… కవి తేదీలు అన్నాడు కానీ అది ఈ పుస్తకానికి వర్తిస్తుంది.. అవును ఈ పుస్తకం పేజీలు తిప్పనివ్వదు. ఆలోచనల్లో ఆగిపోనిస్తుంది.. ఈ పేజీలు బాధిత వర్గాన్ని దుఖానికి బిగిస్తుంది.. కవిత్వాన్ని ఇంత బలంగా నిర్మించటం ఇటీవలి కాలంలో నేను చదవలేదు… ఇంత ధడంగా వాక్యాల్ని పేర్చాలంటే నరాల్లో రక్తం తిరుగుబాటు పాట పాడుతున్నట్లుండాలి… ఇంతటి శక్తిమంతమైన అభివ్యక్తి ‘శ్రీరాం పుప్పాల’ది… ఈ కవిత్వ శైలి తన ముందు కవిత్వం కంటే ఎన్నో రెట్లు పదునైనది… ఇది నది ఆక్రోశధ్వని.. ఆ నది నిండా గట్లనొరిసే నిరసన సెగల పరవళ్ళు.. ‘పద్దెనిమిదొందల పద్దెనిమిది’.. ఇది ఈ పుస్తకం పేరు.. పేరులోఎంత ఫోర్స్‌ ఉందో కవితా వాక్యాల్లోనూ అంతే వేగముంది.. వత్తి పలుకుతున్న పేరు వెనుక వందల ఏండ్ల వత్తిడుంది.. ఇది నది గొంతుకగా కవి అభివర్ణన.. కానీ ఇది సముద్రహోరు.. తుఫాను గర్జన.. గాయపడ్డ, దగాపడ్డ, చెరచబడ్డ, దోచుకోబడ్డ, అణగారిన గుండెల్లో అగ్నికణం.. నిప్పు కాపిన ఢమ ఢమ డప్పుల మోత.. ”తెప్పలన్నీ మునిగిపోతున్నాయి.. ఈ ఉపాఖండం చిమ్మ చీకటిలో మగ్గిపోతోంది” ”పూచీకత్తు దొరకని సామాన్యుని కథంతా ఒక ఉపాయం ప్రకారమే ముగిసిపోతుంది”.. ఉపా దగ్గర ఇన్విటెడ్‌ కామాస్‌ పెట్టుకొని చదవండి ఈ పుస్తక సారాంశం ఏంటో మీకు అవగతమవుతుంది.. ఉప ఖండాన్ని ఉపాఖండంగా అభివర్ణించటం ఇప్పటివరకూ రాని అల్టిమేట్‌ స్టేట్‌మెంట్‌ హై లెవెల్‌ ఎక్స్‌ప్రెషన్‌.. తద్వారా కవి దేనిని నిరసిస్తున్నాడో.. భీమా నది గొంతులో లావాగ్ని సెగ ఎంతలా పెనుమంటగా ప్రవహిస్తుందో ఎరుక అవుతుంది.. అరిగిన పోయిన మెటఫర్‌లు నేను వాడను కానీ.. ఈ రొండు సిమిలీ ఉదాహరణలు చాలు.. సాహిత్య స్పహ ఏ కొద్ది మాత్రం ఉన్న వారికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఈ కవిత్వం ఏ కోవకు చెందిందో ఈ దీర్ఘ కవితా వస్తువు ఏంటో…. ఈ కవి రెండు రాష్ట్రాల్లో తన అభిమాన వర్గాన్ని బలంగా నిర్మించుకోటంలో సఫలీకతుడైనవాడు.. ఈ దీర్ఘ కవితలో లెక్కకు మించి రివ్యూలు రాబట్టే సారాంశం ఉంది. అందులో సందేహం లేదు.. తన దీర్ఘకవితా మూలవస్తువు హైలెట్‌ అయ్యేలా ఎందరో సాహిత్య దిగ్గజాలు.. సాహిత్యేతర సామాజిక వర్గాలు, విద్యా వంతులు మేధావుల నుంచి తన ఎఫర్ట్‌కు తగిన సమీక్షలు తప్పకుండా వస్తారు… అందరూ అదే ప్రధాన వస్తువుపై దష్టి కేంద్రీకరిస్తారు. నేను మాత్రం ఈ దీర్ఘ కవితలోని మరో కోణాన్ని మాత్రమే స్పశించదలిచాను. అది సూటిగా మూల వస్తువుకు సంబంధించనిది కాకపోయినా కవి కవిత్వ నిర్మాణ బలం ఏమిటో విశదపరుస్తుంది. వస్తువును పరిపుష్టం చేసేది..
ఇక కవిత్వం ప్రధాన వస్తువులోకొస్తే..
1- ”సగం కాలిన చితులపై నుండి అంటరాని కళేబరాన్నై పైకి లేస్తున్నాను నేను భీమా నదిని”
2- ”కవిత్వం ఎక్కుపెడుతున్న విలుకాన్ని కరెంటు ఫెన్సింగు వేస్తున్నారు”
పైన ముందుగా చెప్పిన ఆ రెండు ఉదాహరణలతో పాటు ఈ వాక్యాలు చాలు, ఈ కవిత్వంలోని వస్తువు గురించి అర్థం అవ్వటానికి.. దీర్ఘ కవిత సాధారణంగా ఏదో ఒక వస్తువునే కలిగి ఉండటం మనకు తెలుసు. కానీ ఈ దీర్ఘ కవితలో మూడు అంశాలున్నాయి..
1- వర్ణ వివక్ష
2- భావప్రకటనా స్వేచ్ఛపై దాడి..
3- రాజద్రోహ అభియోగాలు మోపే దుర్మార్గపు నల్ల చట్టం ఉపా..
అయితే ఇవేవీ కొత్త వస్తువులో సంఘటనలో కావు మనలో ప్రతి ఒక్కరికీ అవగాహనుంది.. అయితే సమాజాన్ని జాగత పరచటంలో కవి అలిసిపోడు.. విసుగుచెందడు.. ఈ విషయంలో సజనకారుడి నేత్రానికి సాధారణ చూపుకి వ్యత్యాసముంది..
అంశాలు రొటీన్‌ అనిపించొచ్చు కానీ వాటిపై మీరైనా నేనైనా ఈ కవైనా నిరంతరమూ చర్చకు పెట్టాల్సినవి ప్రశ్నల నిప్పులు రాజేయాల్సినవి సమాధానాల పరిష్కారాలు రాబట్టాల్సినవి.. ఈ ఆవేదన ఆక్రోశం భీమా నది గొంతుతో పలికించటం ప్రత్యేకత అయితే కవిత్వ నిర్మాణం కవి స్థాయిని పెంచింది.. అర్థం అయ్యేలా చెప్పగలిగితేనే సారం తలకెక్కుతుంది.. చరిత్రో, పాఠమో అవగతం అవుతుంది.. ఆ పని ఈ కవిత చేసింది. ఇందులో వాడిన కవిత్వ భాష కవి ప్రతిభకు దర్పణం..
”పదునైన కత్తి మొనలన్నీ గుండె లోతుల్ని తెగ్గోస్తున్నారు జల్లెడైన నీటి చర్మాన్నిప్పటికీ బుల్లెట్లు చీల్చుతున్నారు..” అణగారిన వర్గపు ఆక్రందనకు అక్షరరూపం కావా ఈ వాక్యాలు..?
”కవిని జైల్లో పెట్టారు రాజ్యం ఎన్ని సార్లీ తప్పు చేస్తుంది..
ఇరుకుతనమ్నుంచి కూడా గొంతెత్తేవాళ్లు సకల జీవుల భాష మాట్లాడగలరు”..
”ఈ దేశపు నల్ల గౌను ముందు తమ కేసు తామే వాదించుకోలేని అనేక వర్ణాల ఇంధ్ర ధనువులున్నారు” సాయిబాబా, వరవరరావు అని వేరే చెప్పాలా.. మితలారా పై వాక్యాలు ఎవరెవరిని ఉద్దేసించినవో… అండా సెల్‌ దుస్థి కల్పించిన కారకులెవరో తెలుసు కదా..
”చెరసాల కనుపాపల్లో పూసిన తురాయిపూల తహతహ ఇనుప తెరల్ని కరిగించి వేస్తుంది”.. రాజ్యం అణచివేత ధోరణి తీరు మారకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్న సూటి హెచ్చరికను ఎంత సుతిమెత్తగా చెప్పాడో చూడండి.. ఒక చోట ”నిదుర మేయని రాత్రులు” అంటాడు.. బాధిత వర్గపు నిద్రపట్టని ఉక్కిరిబిక్కిరి స్థితిని కవి అంతలా ఓన్‌ చేసుకున్నాడు. ఒక సంక్లిష్టత స్థితిని అంత కవిత్వం చేయటం గమనార్హం..
”ఉడుకు నెత్తురు వెల్ల వేసుకున్న ఇంటి గోడల్లా ఉంటాయి, కోతలయ్యాక కొడవళ్ళిక్కడ నెలవంకలై వచ్చి వాలతాయి.. గూట్లోకెళ్ళే ముందు పక్షుల్లా సేదతీరతాయి”. అంత సీరియస్‌ సబ్జెక్ట్‌ లోకి ఇంత కవిత్వ హద్యం ఎలా నింపాడో చూడండి. ఎర్ర మట్టి గోడలను విప్లవ ప్రతీక చేశాడు.. కొడవళ్లను నిలబెడితే అర్ధచంద్రాకారాకతిలో నెలవంకల్లా ఉంటాయి… పొలాల్లో కోతల్లో అలసిన కొడవళ్ళు గూట్లోకి వెళ్ళే పక్షుల్లా సేద తీరతాయి, భలే పోలిక. చాలా అందంగా అమరింది.. కోతలు అయ్యాక అని కవి అనటంలో అర్థం వేరే.. కోయాల్సిన కోతలు మాత్రం ఇంకా ఉన్నారు, కొడవళ్లు మరింత కక్కు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని భావన..
మహాకవి వాపోయినట్టు మనుషుల్లో పుట్టుకతో వద్ధులు ముందుయుగం దూతలు ఉన్నట్టే.. కొడవళ్లలో కూరలు తరిగేవి, ముదురు పనల పొలాలను కోసే కక్కు కొడవళ్లు వేరుగా ఉంటారు..
”కాగితప్పూల రెక్కలపై వాన చినుల్ని ఆడుకోనివ్వరేమో కదా..” క్షీణించిన స్వేచ్ఛకు పరాకాష్ట ప్రకటన ఇది. కానీ అంత బరువైన వేదన ఎంత సునితంగా చెప్పాడో గమనించండి..
”తోడు పడుకునేందుకు రాని స్నేహితుడి కోసం చేలోని జొన్న కంకులు పాలుకట్టవు” ఊస బియ్యమంత కమ్మగా ఉంది ఈ వాక్యం.. పాలకండె అంత అందంగా ఉంది.. మంచు రాత్రుల్లో మంచెల్లో చేల కావలిగా గ్రామాల్లో పాలకనుకుల వయ్యసంత పాలేర్లే ఉంటారు. జొన్న చేనును దళిత వర్గ కావలితనం స్థితిలోంచి, పహారాలో ఉన్న గిరిజన గూడేల దయనీయ దశ్యాన్ని ఒక్క వాక్యంలో దశ్యమానం చేశాడు..
”మనుషులు ఒకర్నొకరు పలకరించుకోటం కన్నా తడిపి ముద్దచేసే వానెక్కడ కురుస్తుంది ?” సమాజంపై కురవాల్సిన మనిషితనం కోసం ముసిరిన నల్లమబ్బు భావాలివి… అంటరాని తనం అనే మన్ను కప్పబడిన మనిషితనాలను మొలిపించాల్సిన చినుకులు కావా ఇవి ?…
”గాలిపటం కిందకు దిగిపోయాక ఆకాశం కళ్లెవరి కోసం అతతగా వెతుకుతాయి.. పడవెళ్లిపోయాక తీరమెందుకు దిగులు పడుతుంది, నీటిలోని చేపలు తమ కాలితో తన్నకపోతే నదిగుండె నరాలెంత చిక్కబడతాయి..” విరహాన్ని వియోగాన్ని కోల్పోతున్న తనాన్ని కవి ఇలా రొమాంటిసైజ్‌ చేశాడు. విప్లవ కవితలో ఇలాంటి ఎన్నో ప్రతీకల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు.
సామాజిక రుగ్మతలు, సమస్యలపై భీమా నది గొంతుతో కవి పడ్డ ఆవేదన అభినందనీయం కానీ.. దేశం గాయాల బొబ్బల బాధితుల బర్నింగ్‌ వార్డ్‌ అక్షరాలు, వాక్యాలు పుస్తకాల లేపనాల పూతలతో బర్నింగ్‌ సమస్య తీరదు మారదు.. ఏసీ గదిలో కూర్చోని ఉక్కిరిబిక్కిరి స్థితిని గతిని నమోదు చేసి చల్లబడితే చాలదు..
హని బాబు, తేల్‌ తుంబ్డే, గౌతం నవ్‌ లఖా, సుధా భర్ధ్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, గోంజాల్వెజ్‌, వరవర రావు, సాయిబాబా తదితర హక్కుల కార్యకర్తలా ప్రత్యక్ష్య పోరాట కార్యాచరణ వాగ్దానమివ్వాలి.. అప్పుడే వర్గ సమాజం తన రాతల్ని విశ్వసిస్తుంది.. కావ్య గౌరవం పెంపొందుతుంది.

– శ్రీనివాస్‌ సూఫీ, 9640311380

Spread the love