కేంద్రానికి నితీశ్‌ ఝలక్‌

Nitish Jhalak to the Centre– బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
– లేదంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి : జనతాదళ్‌ (యునైటెడ్‌)
న్యూఢిల్లీ : బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న సుదీర్ఘకాల డిమాండ్‌ను జనతాదళ్‌ (యునైటెడ్‌) మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ డిమాండ్‌ సాధన కోసం పోరాటాన్ని సాగిస్తామని పునరుద్ఘాటించింది. ఈ మేరకు శనివారం న్యూఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించాలని కోరింది. ”బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించాలన్న డిమాండ్లు మా తీర్మానంలో వున్నాయి. ఈ రెండింటి కోసం మేం పోరాటం కొనసాగిస్తాం.” అని జేడీయూ రాజకీయ సలహాదారు, జాతీయ ప్రతినిధి కె.సి.త్యాగి ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని గతేడాది నవంబరులో, ఎన్‌డిఎలో తిరిగి చేరడానికి కొద్ది మాసాలు ముందుగా నితీశ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో, బీజేపీ స్వంతంగా మెజారిటీని సంపాదించడంలో విఫలమైంది. 240సీట్లతో సరిపెట్టుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్‌డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈసారి ఎన్‌డీఏ ప్రభుత్వంలో 12లోక్‌సభ స్థానాలున్న జేడీయూ 16 మంది ఎంపీలున్న తెలుగుదేశం కీలక మిత్రపక్షాలుగా వున్నాయి. బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన తర్వాత ఈ నెల ఆరంభంలో త్యాగి మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అన్నది దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ అని, ఈ పొత్తుకు అదేమీ ముందు షరతు కాదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వానికి తాము సంతోషంగా మద్దతిస్తున్నామని చెప్పారు. అయితే అంత మాత్రాన తాము ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదులుకోమని, తర్వాతనైనా దీన్ని చేపడతామని చెప్పారు. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం త్యాగి మాట్లాడుతూ, ఎన్‌డీఏలోనే వుంటామని నితీష్‌ సమావేశంలో మరోసారి పునరుద్ఘాటించారని చెప్పారు. కూటమి నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారని తెలిపారు. విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు, తీవ్రంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ), ఎస్సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లను 50నుంచి 65శాతానికి పెంచుతూ బీహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంను ఆశ్రయించాలని పార్టీ ఈ సమావేశంలో నిర్ణయించింది. పార్టీ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు గానూ రాజ్యసభ ఎంపి సంజరు ఝాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేసినట్లు త్యాగి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆనాడు మోడీ ప్రభుత్వం తిరస్కరించినందువల్లే 2018లో తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చేసింది. జెడి(యు) మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందే తిరిగి ఎన్‌డీఏలో చేరింది.

Spread the love