ఐటీ రంగంలో నెం .1

–  దేశానికి బువ్వ పెట్టే రాష్ట్రం తెలంగాణ
– కేంద్రం నుంచి నయాపైసా సాయం లేదు
– ఐటీశాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణను ఐటీి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. అయినా దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించాం. ఈ రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టుని కేంద్రం రద్దు చేసినా సాధించి చూపించాం. రెండేండ్ల పాటు కరోనా సంక్షోభం, ఆ తర్వాత మారిన పరిస్థితులను సైతం తట్టుకుని ఈ అభివద్ధిని సాధించాం. ఈ దేశానికి బువ్వపెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది. దేశాన్ని సాకుతోంది’అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఐటీశాఖ వార్షిక ప్రగతి నివేదికను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఐటీ రంగ వద్ధిలో అన్ని సూచీల్లో జాతీయ సగటును దాటి వేగంగా ముందుకు పోతున్నదని అన్నారు.31.44శాతం వార్షిక వద్ధితో రూ.2,41,275 కోట్ల ఐటీ ఎగుమతులు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. 2014లో 3,23,396 ఉద్యోగాలుంటే నేడు 16.2శాతం వార్షికవృద్ధితో ఆయా ఉద్యోగాల సంఖ్య 9,05,715 మందికి పెరిగిందని తెలిపారు. భారతదేశంలో వస్తున్న ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తెలంగాణ నుంచి వస్తున్నదని వివరించారు. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల మాత్రమే ఉంటే ఇప్పుడు నాలుగు రేట్లకుపైగా పెరిగి రూ.2,41,275 కోట్లకు పెరిగిందన్నారు. ఫిస్కర్‌ తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. కాల్‌వే గోల్ఫ్‌ కంపెనీ, క్వాల్కమ్‌ అమెరికా, గూగుల్‌ తన కంపెనీని అమెరికా అవతల అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిందని వివరించారు. స్విస్‌రే, జడ్‌ఎఫ్‌, ఎక్సేరియన్‌ సర్విసెస్‌, ఎల్‌టీఐమైండ్‌ ట్రీ, బోస్చ్‌ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మైక్రోసాఫ్ట్‌ మూడు కొత్త డేటా సెంటర్లను సైతం ఏర్పాటు చేయనుందన్నారు. అమెజాన్‌ వెబ్‌ సర్విసెస్‌ మూడు డేటా సెంటర్లు, సైబర్‌ ఆర్క్‌ కొత్త రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ గ్రూప్‌, డాజ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ సంస్థ. జ్యాప్‌ కామ్‌ గ్రూప్‌, టెక్నిక్‌ఎఫ్‌ ఎంసీ గ్లోబల్‌ సాప్ట్‌వేర్‌ డెలివరి సెంటర్‌, అల్లియాంట్‌ గ్రూప్‌ విస్తరణ, వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, మన్‌డీ హౌల్డింగ్స్‌ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.38వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌, సీఆర్‌ఓ అమరనాథ్‌రెడ్డి, నాస్కామ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ శ్రీనివాసన్‌, సెజ్‌ ప్రతినిధి కె.శ్రీనివాస్‌, ఎస్‌టీపీఐ ప్రతినిధి భరత్‌కుమార్‌, ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love