– షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
– సర్వేలన్నీ మనకే అనుకూలం
– కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాలేదు
– దళితబంధు నిధులు కాజేశారు..ఫిర్యాదులు అందాయి
– తీరు మార్చుకోండి..లేకుంటే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది
– కవితకు ఈడీ నోటీసు..భయపడేది లేదు
– న్యాయపోరాటం చేస్తాం
– బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తున్నది. వారు పద్ధతి మార్చుకోకుంటే, వచ్చే ఎన్నికలకు వారినే మార్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు రాజకీయ వేధింపుల్లో భాగంగా ఇచ్చినవే. ఎక్కడా బెదిరేది లేదు. అరెస్టు చేస్తే చేయనివ్వండి. న్యాయపోరాటం చేస్తాం” అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ఆయన అధ్యక్షతన శుక్రవారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అయన పలు అంశాలను ప్రస్తావించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉందనీ, ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలని అన్నారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా త్వరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 103 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. 99 శాతం మంది సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తామని చెప్పారు. పథకాల అమలు ప్రక్రియపై ఇంటెలిజెన్స్ నిఘా ఉందనీ, ఎవరైనా తప్పు చేస్తే టికెట్లు ఇవ్వబోనని హెచ్చరించారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొందరు నేతలు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయనీ, వారివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పులు చేసే ప్రజాప్రతినిధులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు దళితబంధు నిధులు కాజేసినట్టు తనకు ఫిర్యాదుల అందాయనీ, వారిని ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. మంత్రివర్గ సమా వేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా పార్టీ నాయకులకు ఆయన వివరించారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు, దళితబంధు, రెండో విడత గొర్రెల పంపిణీ సహా పలు ప్రభుత్వ పథకాలను వివరించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
అరెస్టు చేస్తే చేయనివ్వండి…
బీఆర్‌ఎస్ నేతల్ని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే వేధిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను ఇబ్బంది పెట్టారనీ, ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఇలాంటి వాటికి బెదరాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏం చేస్తారో చూద్దాం. అరెస్టు చేస్తే చేసు కోనివ్వండి. న్యాయపోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. వారి కుట్రల్ని ప్రజాస్వామ్య బద్ధంగా, న్యాయ పరంగా ఎదుర్కొందామని నేతలకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్‌ఎస్ ఆవిర్భావం రోజే ప్లీనరీ
ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భావం సందర్భంగా పార్టీ ప్లీనరి నిర్వహిస్తున్నామనీ, ఇకముందు బీఆర్‌ఎస్ ఆవిర్భావం రోజే పార్టీ ప్లీనరీ నిర్వహించాలని యోచిస్తున్నామన్నారు. నాయకులు క్షేత్రస్థాయిలో పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. బీజేపీ సభలకు కౌంటర్ సభలు పెట్టి, విమర్శల్ని బలంగా తిప్పి కొట్టాలనీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని చెప్పారు. సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు పాల్గొన్నారు.
ఇదీ షెడ్యూల్…
రాష్ట్ర ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చినట్టు సమాచారం.
– మార్చి 25 నుంచి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు. 45 రోజులు వీటిని నిర్వహించాలి. పది గ్రామాలకు ఒక సమ్మేళనం పెట్టాలి.
– ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ. అదేరోజు ఎన్టీఆర్ స్టేడియంలో సభ నిర్వహణ.
– ఏప్రిల్ 25న అన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణలు.
– ఏప్రిల్ 27న ఎల్‌బీ స్టేడియంలో బీఆర్‌ఎస్ ప్లీనరీ
– ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభం. ఆ ప్రాంగణంలోనే బహిరంగ సభ
– జూన్ 1న అమరవీరుల స్తూపం అవిష్కరణ