దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు

– లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశా
– సభలో అనుమతిస్తే మాట్లాడతా
– ఇది ప్రజాస్వామ్యానికి పరీక్ష : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ : తానెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. గురువారం పార్లమెంటు సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తూ రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ”దేశానికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ నన్ను అనుమతిస్తే సభలో మాట్లాడతా. అవకాశం ఇవ్వకపోతే పార్లమెంట్‌ బయట మాట్లాడతా” అని తెలిపారు. పార్లమెంటు ముగిసిన తరువాత ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ‘పార్లమెంటులో మాట్లాడేందుకు వారు నన్ను అనుమతిస్తే, నేను ఏమనుకుంటున్నానో అది చెబుతాను’ అని అన్నారు. ‘పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్‌ను కలిశాను. ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు నాపై ఆరోపణలు చేశారు. కాబట్టి నా అభిప్రాయాలను సభలో ఉంచే హక్కు నాకు ఉంది. శుక్రవారం పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతించాలని కోరారు. ఆయన అనుమతిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం తాను ప్రధాని మోడీ, అధానిపై ప్రశ్నలు లేవనెత్తుతూ సభలో ప్రసంగించానని, ఆ ప్రసంగాన్ని తొలగించారని అన్నారు. ప్రభుత్వం, ప్రధానమంత్రి అదానీ సమస్యతో భయపడుతున్నారనీ, అందుకే వారు దృష్టి మల్చుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ, అదానీల మధ్య సంబంధం ఏంటన్నది ప్రధాన ప్రశ్న అని అన్నారు. ‘పార్లమెంటులో తనపై ఆరోపణలు చేసినందున, మాట్లాడే అవకాశం పొందటం నా ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే నేను పార్లమెంటులో మాట్లాడగలిగేవాడిని. కాబట్టి, నిజానికి మీరు చూస్తున్నది ప్రజాస్వామ్యానికి పరీక్ష’ అని పేర్కొన్నారు.

Spread the love